
యూఎస్‌ఏతో జరిగిన వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్‌లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
హర్మీత్ ఓవర్‌లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో యూఎస్‌ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్‌ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment