WI vs ZIM: హెట్‌మైర్‌ ‘సూపర్‌’ షో | T20 World Cup 2026: West Indies big win over Zimbabwe | Sakshi
Sakshi News home page

WI vs ZIM: హెట్‌మైర్‌ ‘సూపర్‌’ షో

Feb 23 2026 11:13 PM | Updated on Feb 24 2026 9:28 AM

T20 World Cup 2026: West Indies big win over Zimbabwe

హెట్‌మైర్, పావెల్‌

టాస్‌ నెగ్గగానే జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా బౌలింగ్‌ ఎంచుకొని మొదటి తప్పు చేశాడు. హెట్‌మైర్‌ బ్యాటింగ్‌కు దిగగానే 9 పరుగుల వద్ద ముసెకివా సులువైన క్యాచ్‌ నేలపాలు చేసి ముప్పుతెచ్చాడు. ఇది మ్యాచ్‌నే మార్చేసింది. వాంఖడేను మురిపించింది. ప్రేక్షకుల్ని మెరుపులతో ముంచెత్తింది. ఈ ప్రపంచకప్‌లో అసలైన టి20 విందునిచ్చింది. ‘సూపర్‌–8’లో విండీస్‌కు భారీ విజయాన్నిచ్చింది.  

ముంబై: వెస్టిండీస్‌ విధ్వంసం... జింబాబ్వే విలాపం... ఈ టి20 ప్రపంచకప్‌కే మెరుపుల ‘షో’కులద్దిన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు 107 పరుగులతో తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన వెస్టిండీస్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెట్‌మైర్‌ (34 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎన్‌గరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇవాన్స్‌ (21 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించాడు. గుడకేశ్‌ మోతీ (4/28), హోసిన్‌ (3/28) వెన్నువిరిచారు. తమ తదుపరి ‘సూపర్‌–8’ పోటీల్లో 26న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్‌; అదేరోజు భారత్‌తో జింబాబ్వే ఆడతాయి.  

హెట్‌ ‘ఫైర్‌’ 
ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (9), షై హోప్‌ (14) వికెట్లను కోల్పోయిన విండీస్‌ హెట్‌మైర్, పావెల్‌ ధనాధన్‌ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లింది. క్రిమర్‌ వేసిన ఏడో ఓవర్లో 2 వరుస సిక్స్‌లు కొట్టిన హెట్‌మైర్‌... రజా వేసిన మరుసటి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేశాడు. దీంతోనే అతను 19 బంతుల్లో టి20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన కరీబియన్‌ బ్యాటర్‌గా రికార్డును నెలకొల్పాడు. హెట్‌మైర్‌ బాదిన మొత్తం 7 సిక్స్‌ల్లో ఐదింటిని ఈ రెండు ఓవర్లలోనే కొట్టడం విశేషం! హెట్‌మైర్‌ విధ్వంసరచనకు కారణమైన ముసెకివా మళ్లీ అతను 70 పరుగుల వద్ద కొట్టిన షాట్‌ను రెండోసారి క్యాచ్‌ పట్టలేకపోయాడు. మరోవైపు పావెల్‌ 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు అవుటయ్యాక రూథర్‌ఫోర్డ్‌ (13 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫర్డ్‌ (10 బంతుల్లో 21; 3 సిక్స్‌లు), హోల్డర్‌ (4 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) దంచేయడంతో విండీస్‌ సులువుగా 250 పరుగుల్ని దాటేసింది. 

హెట్‌మైర్

జింబాబ్వే విలవిల 
ఆ్రస్టేలియా, శ్రీలంకలాంటి మేటి జట్లను ఓడించి సూపర్‌–8కు చేరుకున్న జింబాబ్వే... విండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు కుదేలైంది. 20 పరుగుల వద్దే మరుమని (14), బెనెట్‌ (5), బర్ల్‌ (0) వికెట్లను కోల్పోయింది. కాస్త కుదుటపడి 50 స్కోరును దాటగానే గుడకేశ్‌ మోతీ చావుదెబ్బ తీయడంతో 103 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువైంది. మైయెర్స్‌ (28), కెప్టెన్‌ రజా (27) మెరుగ్గా ఆడారంతే! ఆఖరి వికెట్‌ ఎన్‌గరవ (7 నాటౌట్‌) అండతో బ్రాడ్‌ ఇవాన్స్‌ కాసేపు చెల రేగడంతో జింబాబ్వే పరాజయం ఆలస్యమైంది.

స్కోరు వివరాలు 
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రాండన్‌ కింగ్‌ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవ 9; షై హోప్‌ (సి) బెనెట్‌ (బి) ఇవాన్స్‌ 14; హెట్‌మైర్‌ (సి) బెనెట్‌ (బి) క్రిమర్‌ 85; పావెల్‌ (సి) ముసెకివా (బి) ముజరబాని 59; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 31; షెఫర్డ్‌ (సి) బర్ల్‌ (బి) ఎన్‌గరవ 21; హోల్డర్‌ (సి) మున్యొంగా (బి) ముజరబాని 13; ఫోర్డ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–17, 2–54, 3–176, 4–194, 5–229, 6–248. 

బౌలింగ్‌: ఎన్‌గరవ 4–0–47–2, ముజరబాని 4–0–42–2, ఇవాన్స్‌ 4–0–46–1, క్రిమర్‌ 4–0–38–1, రజా 3–0–52–0, మైయెర్స్‌ 1–0–19–0. 
జింబాబ్వే ఇన్నింగ్స్‌: మరుమని (సి) హెట్‌మైర్‌ (బి) ఫోర్డ్‌ 14; బెనెట్‌ (బి) హోసిన్‌ 5; మైయెర్స్‌ (బి) మోతీ 28; బర్ల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హోసిన్‌ 0; రజా (బి) మోతీ 27; మున్యొంగా (సి) జోసెఫ్‌ (బి) మోతీ 14; ముసెకివా (బి) మోతీ 0; ఇవాన్స్‌ (సి) హోసిన్‌ (బి) ఫోర్డ్‌ 43; క్రిమర్‌ (సి అండ్‌ బి) హోల్డర్‌ 0; ముజరబాని (సి) జోసెఫ్‌ (బి) హోసిన్‌ 0; ఎన్‌గరవ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 147. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–20, 4–52, 5–94, 6–94, 7–101, 8–102, 9–103, 10–147. బౌలింగ్‌: హోసిన్‌ 4–1–28–3, ఫోర్డ్‌ 3.4–0–27–2, మోతీ 4–1–28–4, జోసెఫ్‌ 3–0–35–0, హోల్డర్‌ 3–0–25–1.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement