T20 World Cup 2021: క్రికెట్‌లో దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రీడా ప్రపంచం దృష్టి మొత్తం దీనిపైనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 24న మరోసారి రసవత్తరపోరు ఆరంభం కానుంది.
అయితే, పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోటీలో ఎల్లప్పుడూ టీమిండియాదే పైచేయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శనివారం నాటి హై ఓల్టేజ్ పోరుకు ముందు... టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఐదుసార్లు పాకిస్తాన్‌తో ముఖాముఖి తలపడిన భారత జట్టు సాధించిన విజయాలను ఓసారి గుర్తుచేసుకుందాం.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సెప్టెంబరు 14, 2007:
తొట్టతొలి వరల్డ్ టీ20 టోర్నీలో డర్బన్ వేదికగా జరిగిన సెప్టెంబరు 14 నాటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ టై కాగా... బౌల్ అవుట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
సెప్టెంబరు 24, 2007:
జోహన్నస్‌బర్గ్‌లో జరిగిన 2007 ఫైనల్ మ్యాచ్‌లో ధోని సేన.. పాకిస్తాన్‌ను ఓడించిన తీరును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో చిరకాల ప్రత్యర్థిపై 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
సెప్టెంబరు 30, 2012
కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 128 పరుగులకే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి... ఒక వికెట్ తీయడం విశేషం.
21 మార్చి, 2014
ఢాకాలో జరిగిన ఏకపక్ష పోరులో టీమిండియా పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో 130 పరుగులకే పాక్ తోకముడిచింది.
19 మార్చి, 2016
సూపర్-10 గ్రూపు-2లో భాగంగా కోల్‌కతాలో జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ధోని సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా... బౌలర్లంతా మెరుగ్గా రాణించడంతో 118 పరగులకే దాయాదిని కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలో తడబడినప్పటికీ విరాట్ కోహ్లి అద్భుత హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక ఐదేళ్ల విరామం తర్వాత కోహ్లి సారథ్యంలోని టీమిండియా అక్టోబరు 24న దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అన్నిరకాలుగా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో ఓపెనింగ్ సహా మిడిలార్డర్ ఆప్షన్స్ పరిశీలించడం.. రెండు మ్యాచ్‌లలోనూ ఘన విజయం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ఉంది.
మరోవైపు.. జట్టును ప్రకటించిన నాటి నుంచి మాజీల పెదవి విరుపులు.. వార్మప్ మ్యాచ్‌లను పాక్.. సరిగ్గా వినియోగించుకోలేక చతికిలపడిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదుల పోరులో టీమిండియా గెలుపొందడం ఖాయమేనని మెజారిటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: T20 World Cup: నువ్వసలు ఏం చేస్తున్నావు బాబర్.. టీమిండియాను చూసి నేర్చుకోండి
Comments
Please login to add a commentAdd a comment