టాప్ సీడ్ ప్రియాన్షుపై విజయం
గువాహటి: కీలకదశలో పాయింట్లు సాధించిన తెలంగాణ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని సాధించాడు. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ (భారత్)ను బోల్తా కొట్టించి తరుణ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ తరుణ్ 24–22, 15–21, 21–13తో ప్రియాన్షును మట్టికరిపించాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
రెండో గేమ్‌లో ప్రియాన్షు తేరుకోగా... నిర్ణాయక మూడో గేమ్‌లో తరుణ్ పైచేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో తరుణ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సతీశ్ కుమార్, రవి, ఆయుశ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
పోరాడి ఓడిన శ్రియాన్షి
మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. వు లువో యు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రియాన్షి 21–19, 12–21, 12–21తో ఓడింది. భారత్‌కే చెందిన మాన్సి సింగ్, తన్వీ శర్మ, అన్‌మోల్ ఖరబ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప; ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; రోహిత్–రిదువర్షిణి; అశిత్–అమృత; కనపురం సాతి్వక్ రెడ్డి–వైష్ణవి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment