Photo Credit: BCCI Twitter
శ్రీలంక, భారత్ మధ్య శనివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే లంక తొలి టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించగా, భారత్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. తుది జట్టుపై ఒక అంచనా ఉన్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో గాలేలో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.
👉భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే టెస్ట్ క్రికెట్‌లో వంద సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో మూడువేల పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్‌గా నిలవడానికి పంత్‌కు మరో 220 పరుగులు కావాలి. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా టెస్ట్ సెంచరీ చేయలేదు, ఈసారి పంత్ ఆ రికార్డును అందుకుంటాడా అన్నది చూడాలి.
👉యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఓపెనర్‌గా జైస్వాల్ నిలవనున్నాడు. 24 ఏళ్ల వయసులోనే 5 వేర్వేరు దేశాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ సరసన చేరేందుకు జైస్వాల్‌కు ఒక్క శతకం అవసరం.
👉అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు (అన్ని ఫార్మాట్లు) పూర్తి చేసుకోవడానికి కేఎల్ రాహుల్ మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత విదేశాల్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్ నిలిచేందుకు రాహుల్ కు రెండు సెంచరీలు దూరంలో నిలిచాడు.
👉ఇక టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో మూడువేల పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 31 పరుగులు అవసరం. కెప్టెన్‌గా 2వేల పరుగులు సాధించడానికి అతడికి 150 పరుగులు కావాలి. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలిచేందుకు గిల్ ఎదుట సువర్ణావకాశం ఉంది.
👉లంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది.


