Ind Vs WI 1st Test: Team India Won By Innings And 141 Runs Vs West Indies - Sakshi
Sakshi News home page

WI Vs IND 1st Test Day 3: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్‌ విజయం

Published Sat, Jul 15 2023 7:21 AM | Last Updated on Sat, Jul 15 2023 9:43 AM

Team-India Won By Innings 141 Runs Vs West Indies-1st Test  - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలానికి అసలు ఏ మాత్రం​ పోరాడకుండానే చేతులెత్తేసిన విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో భారీ గెలుపును అందుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం.

ఇక రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది. 

ఓవర్‌నైట్‌ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులతో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు జైశ్వాల్‌, కోహ్లి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించిన అనంతరం జైశ్వాల్‌ 171 పరుగుల వద్ద అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగడంతో మారథాన్‌ ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ పడింది. ఈ దశలో కోహ్లి ఆటలో వేగం పెంచాడు. అయితే అజింక్యా రహానే మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం జడేజాతో కలిసి కోహ్లి ఇన్నిం‍గ్స్‌ను నడిపించాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లి కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 421 పరుగుల వద్ద కెప్టెన్‌ రోహిత్‌ ఇన్నిం‍గ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. 

271 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిసిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లతో విండీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతనికి తోడు జడేజా కూడా రెండు వికెట్లు తీయడంతో వెస్టిండీస్‌ రెండో ఇన్నిం‍గ్స్‌లో 130 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అశ్విన్‌ ఏడు వికెట్లు తీయగా.. జడేజా రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. 

ఉపఖండం అవతల టీమిండియాకు టెస్టుల్లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్‌ విజయం. విండీస్‌పై టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంతకముందు 1978లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా ఇన్నింగ్స్‌ రెండు పరుగుల తేడాతో, 2002లో హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో, 2005లో బులవాయో వేదికగా జింబాబ్వేపై ఇన్నింగ్స్‌ 90 పరుగుల తేడాతో, 2016లో నార్త్‌సౌండ్‌ వేదికగా వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

► వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది 23వ విజయం. టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక విజయాలు ఆస్ట్రేలియాపై 32 ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌పై(31 విజయాలు), వెస్టిండీస్‌పై 23 విజయాలు, న్యూజిలాండ్‌పై 22 విజయాలు, శ్రీలంకపై 22 విజయాలు ఉన్నాయి

చదవండి: Yashasvi Jaiswal: అయ్యో యశస్వి! ఆ పేసర్‌ వదల్లేదు.. ఓపికగా ఎదురుచూసి! కోహ్లి ఫిఫ్టీతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement