కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్‌ కౌంటర్‌ | Thanks Buddy: Dravid Loses Cool But Smiles At Reporter Over 97 Test Question | Sakshi
Sakshi News home page

కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Thu, Jun 20 2024 10:53 AM | Last Updated on Thu, Jun 20 2024 11:01 AM

Thanks Buddy: Dravid Loses Cool But Smiles At Reporter Over 97 Test Question

ద్రవిడ్‌ (PC: Social Media)

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్‌గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ మ్యాచ్‌లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్‌-8 కోసం వెస్టిండీస్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్‌ ఆడనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్‌కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.

‘‘రాహుల్‌.. మీరు ఇక్కడ మ్యాచ్‌లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాప​కాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్‌తో అన్నాడు.

ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్‌.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్‌.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.

దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్‌.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.

ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.

ఈ మ్యాచ్‌ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. 

భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్‌ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్‌ చేస్తా’’ అంటూ ద్రవిడ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

కాగా 1997లో బార్బడోస్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో రాహుల్‌ ద్రవిడ్‌ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్‌ ద్రవిడ్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్‌గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. 

కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్‌ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

చదవండి: T20 WC 2024: అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement