They Can Do It Again Kapil Dev Backs Team India To Win WC 2023 - Sakshi
Sakshi News home page

ఈసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ మనదే.. అయితే, వాళ్లను కాపాడుకుంటేనే: టీమిండియా దిగ్గజం

Published Tue, Jul 25 2023 8:34 PM | Last Updated on Tue, Jul 25 2023 9:22 PM

They Can Do It Again Kapil Dev Backs Team India To Win WC 2023 - Sakshi

ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ అన్నాడు. సొంతగడ్డపై టోర్నీ జరగడం సానుకూల అంశమని.. అయితే, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారన్న అంశంపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కీలక ఆటగాళ్లకు పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించాడు.

అప్పుడు కపిల్‌ డెవిల్స్‌.. తర్వాత ధోని సేన
కాగా 1983లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు ఏకంగా చాంపియన్‌గా నిలిచింది. నాటి పటిష్ట వెస్టిండీస్‌ను ఓడించి భారత్‌కు తొలిసారి ప్రపంచకప్‌  (వన్డే) అందించింది. ఆ తర్వాత మళ్లీ 2011లో ధోని సేన సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడింది.

పుష్కరకాలం తర్వాత భారత్‌లో
ఈ క్రమంలో పుష్కరకాలం తర్వాత స్వదేశంలో మరోసారి టోర్నీ ఆడే అవకాశం రోహిత్‌ సేనకు దక్కింది. అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్‌లో టీమిండియా హాట్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రతిసారి మనమే ఫేవరెట్‌.. అయితే..
బెంగళూరులో గోల్ఫ్‌ ఫిట్టింగ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ‘‘ఇదంతా ఎలా జరుగుతుందో ముందుగా చెప్పలేం. అయితే, బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. టీమిండియా ప్రతిసారి టోర్నమెంట్‌ ఫేవరెట్‌గానే రంగంలోకి దిగుతోంది.

భారత జట్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో స్వదేశంలో వరల్డ్‌కప్‌ గెలిచిన రికార్డు ఉంది. ఈసారి ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యే ప్రతి ఒక్కరు గత చరిత్రను పునరావృతం చేసేలా శ్రమించి ఆశించిన ఫలితం పొందుతారనే అనుకుంటున్నా. 

గాయాల బారిన పడితే మాత్రం
అందుకోసం వాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంటారని భావిస్తున్నా. మన ఆటగాళ్లలో చాలా మంది దాదాపు 10 నెలల పాటు క్రికెట్‌ ఆడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లపై కాస్త పనిభారం తగ్గించి.. గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలి’’ అని కపిల్‌ బోర్డుకు సూచించాడు.

కాగా గాయాల నుంచి కోలుకుంటున్న టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మాజీ వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, ప్రసిద్‌ కృష్ణ తదితరులు ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది.

చదవండి: వరల్డ్‌కప్‌నకు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే: బీసీసీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement