CWC 2023- Ind Vs Ned: వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో అదరగొట్టి ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఈవెంట్లో ఇప్పటి వరకు ఎనిమిదింట రెండు విజయాలు సాధించింది.
ఆరంభం నుంచి భారీ విజయాలు సాధిస్తున్న సౌతాఫ్రికాకు షాకిచ్చి అద్భుత రీతిలో గెలుపొందిన డచ్ జట్టు.. తర్వాత బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది.
అట్టడుగున డచ్ జట్టు.. టేబుల్ టాపర్‌తో
అయితే, రన్‌రేటు పరంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల కంటే వెనుకబడి పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తమ చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ టీమిండియాతో తలపడనుంది.
ఇప్పటి వరకు ఎనిమిదికి ఎనిమిది విజయాలు సాధించి జోరు మీదున్న రోహిత్ సేనతో మ్యాచ్‌లో గెలుపు గురించి పక్కనపెడితే.. కనీస పోటీ అయినా ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఆదివారం జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది.
యువ బ్యాటర్ ఎంట్రీ
పేసర్ రియాన్ క్లెన్ స్థానంలో యువ బ్యాటర్ నోవా క్రోస్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘ఆదివారం బెంగళూరులో అజేయ టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా నెదర్లాండ్స్ కోరిన మార్పునకు టెక్నికల్ కమిటీ అంగీకారం తెలిపింది.
క్రోస్ ఈ మ్యాచ్‌తో జట్టులోకి వస్తాడు’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా వెన్నునొప్పి కారణంగా రియాన్ క్లెన్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ టోర్నీలో అతడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
మరోవైపు.. నోవా క్రోస్ ఇంతవరకు డచ్ జట్టు తరఫున ఒకే ఒక్క వన్డే ఆడాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో 23 ఏళ్ల నోవా ఏడు పరుగులు చేశాడు.
చదవండి: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ
Comments
Please login to add a commentAdd a comment