Photo Credit: BCCI Twitter
జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా కోచ్ మార్పు అంశం సోమవారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. గంభీర్‌ను తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తిస్థాయి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. రోజంతా ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ కూడా జరిగింది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్నజట్టే అయినప్పటికీ, లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటబట్టింది.
అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనుక వీవీఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక నాలుగు అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది.
స్థిరమైన ఓపెనింగ్ జోడి
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున అభిషేక్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. వైభవ్ ఈ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో ప్రబ్‌సిమ్రన్‌ను ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. రెండు అర్ధసెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎగరేసుకుపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కోచ్‌గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇచ్చి స్థిరమైన ఓపెనింగ్ జోడిని కొనసాగించాడు.
ముగ్గురు పేసర్లతో బరిలోకి
యూకే పర్యటనలో కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్లను ఉపయోగించిన తీరు విమర్శలకు దారి తీసింది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై అనవసర ప్రయోగాలకు పోయి స్పిన్-ఆల్‌రౌండర్ల కలయికపై ఎక్కువగా ఆధారపడి గంభీర్ చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో మొత్తం ఐదుగురిలో ఒకే ఒక పేసర్‌ను ఆడించడం గమనార్హం. ఇక వన్డే సిరీస్‌లోనూ గంభీర్ వ్యూహాలు పనిచేయలేదు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం లక్ష్మణ్ గంభీర్‌కు విరుద్ధంగా వ్యవహరించాడు. టీ20 సిరీస్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడాలని నిర్ణయించిన లక్ష్మణ్.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ సేవలు వినియోగించుకొని అద్భుత ఫలితాలు రాబట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్‌పై నమ్మకముంచిన లక్ష్మణ్ అవకాశాలిచ్చాడు. దీంతో మయాంక్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.
ఆల్‌రౌండర్ల వినియోగం
ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రానాలకు గంభీర్ తుది 11 మందిలో చోటిచ్చాడు. దీని ఫలితంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ లోపించడంతో పాటు, తన నాలుగు ఓవర్ల కోటాను నమ్మకంగా పూర్తి చేయగల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కూడా ఏర్పడింది.
కానీ లక్ష్మణ్ మాత్రం కేవలం ఒక్క ఆల్‌రౌండర్‌కే చోటు కల్పించాడు. తొలి రెండు టీ20ల్లో శివమ్ దూబేను ఆడిపించిన లక్ష్మణ్ చివరి టీ20 మ్యాచ్‌కు సూర్యాంశ్ షెడ్గేను చాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల జట్టులో ఒక పూర్తిస్థాయి బ్యాటర్‌కు అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్‌కు అవకాశం కల్పించినట్లయింది. రింకూ సింగ్ ఫినిషర్‌గా, రవి బిష్ణోయ్ స్పిన్నర్‌గా తమ పాత్రను సమర్థంగా పోషించారు.
ఆటగాళ్లపై నమ్మకం
జింబాబ్వేలో భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సమయంలో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ వారికి అండగా నిలిచాడు. కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి స్థానంలో, చివరి నిమిషంలో బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక క్లిష్టమైన టీ20 మ్యాచ్‌లో బిష్ణోయ్ అధిక ఎకానమీ రేటుతో ఇబ్బంది పడ్డాడు.అయినప్పటికీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడించి ఫుంజుకోవడానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో రవి బిష్ణోయ్ మొత్తంలో 5.667 సగటు ఎకానమీతో 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.


