ఆసీస్‌-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు! | Thinking of Fast Tracking him for BGT: Aakash Chopra on Nitish Reddy | Sakshi
Sakshi News home page

ఆసీస్‌-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు! ఎలా?

Published Tue, Nov 12 2024 5:27 PM | Last Updated on Tue, Nov 12 2024 6:06 PM

Thinking of Fast Tracking him for BGT: Aakash Chopra on Nitish Reddy

పేసర్‌ మయాంక్‌ యాదవ్‌తో నితీశ్‌రెడ్డి (PC: BCCI)

భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు ముందు రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్‌ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. 

ఇక హార్దిక్‌ లేకపోయినా.. శార్దూల్‌ ఠాకూర్‌ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్‌ బౌలింగ్‌ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్‌.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 

నితీశ్‌కుమార్‌ రెడ్డికి బంపరాఫర్‌ 
ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డికి బంపరాఫర్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.

ఆసీస్‌-‘ఎ’తో టెస్టుల్లో విఫలం
అంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్‌-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్‌-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.

రెండు మ్యాచ్‌లలో నితీశ్‌ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్‌ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్‌ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా మేనేజ్‌మెంట్‌ నితీశ్‌ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్‌.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. 

ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు.  అనధికారిక టెస్టుల్లో రన్స్‌ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్‌ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్‌పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.

అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?
‘‘హార్దిక్‌ పాండ్యా లేనందుకు శార్దూల్‌ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి నుంచి పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఏదేమైనా అతడు ఈ సిరీస్‌లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రూపంలో నితీశ్‌ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌లో అదరగొట్టి
కాగా ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్‌ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్‌లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్‌.. 42 ఇన్నింగ్స్‌లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement