శ్రీలంక కెప్టెన్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్‌లో 6 సిక్స్‌లు! వీడియో వైర‌ల్‌ | Thisara Perera smashes 6 sixes in an over in Asian Legends League | Sakshi
Sakshi News home page

శ్రీలంక కెప్టెన్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్‌లో 6 సిక్స్‌లు! వీడియో వైర‌ల్‌

Published Sun, Mar 16 2025 1:36 PM | Last Updated on Sun, Mar 16 2025 1:44 PM

Thisara Perera smashes 6 sixes in an over in Asian Legends League

ఆసియా లెజెండ్స్ లీగ్ 2025లో శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు తిసారా పెరీరా సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీలంక లయన్స్‌కు సారథ్యం వహిస్తున్న పెరీరా.. శనివారం ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్‌లో పెరీరా ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్స్‌లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్‌​ అయాన్ ఖాన్ బౌలింగ్‌లో పెరీరా వరుసగా 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అయాన్ ఖాన్ తన ఓవర్‌ను వైడ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత పెరీరా వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. మళ్లీ నాలుగో బంతిని అయన్ వైడ్‌గా సంధించాడు. మిగిలిన మూడు బంతులను కూడా పెరీరా సిక్సర్లగా మలిచాడు.

35 బంతుల్లో సెంచరీ..
ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పెరీరా.. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తిసారా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫస్ట్ డౌన్‌​ బ్యాటర్ మెవాన్ ఫెర్నాండోతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో పెరీరా కేవలం కేవలం 35 బంతుల్లోనే  తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

ఓవరాల్‌గా 36 బంతులు ఎదుర్కొన్న ఈ శ్రీలంక కెప్టెన్‌.. 2 ఫోర్లు, 13 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మెవాన్ ఫెర్నాండో(81) పరుగులతో రాణించాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగల్గింది. 

దీంతో అఫ్గాన్‌పై 26 ప‌రుగుల తేడాతో శ్రీలంక ఘ‌న విజయం సాధించింది.కాగా ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన జాబితాలో తిసారా పెరీరాతో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌, వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌  కీరన్ పొలార్డ్, రవిశాస్త్రి, హ‌ర్ష‌ల్ గిబ్స్ ఉన్నారు.
చదవండి: టెస్టు క్యాప్‌ పై '804' నెంబర్‌.. పాక్‌ ఆటగాడికి రూ. 4 కోట్లు జరిమానా!?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement