
గతేడాది డిసెంబర్‌లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ జట్టు కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం ఫిఫా వరల్డ్‌కప్ సాధించిన అర్జెంటీనా జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి మొత్తంగా 35 గోల్డ్ ఐఫోన్స్ ఆర్డర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ దెబ్బకు మెస్సీపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ అందుకున్నప్పటి నుంచి మెస్సీ ఖాతాలో అవార్డులు వచ్చి చేరుతూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మెస్సీని లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని దుండగులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అర్జెంటీనాలోని రోసారియో నగరంలో మెస్సీ భార్య కుటుంబానికి చెందిన ఒక సూపర్ మార్కెట్‌పై అర్థరాత్రి వేళ కాల్పులు జరిపారు. 14 రౌండ్ల బులెట్లు పేల్చినట్లు సమాచారం. అనంతరం ''మెస్సీ.. నీకోసం ఎదురుచూస్తున్నాం'' అని నేలపై రాసి వెళ్లారు. రోసారియో నగర మేయర్ పాబ్లో జావ్కిన్ ఒక మాదకద్రవ్యాల డీలర్. అతను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేడు అని కూడా పేర్కొన్నారు.
దీనిపై నగర్ మేయర్ జావ్కిన్ స్పందించాడు. దాడి జరిగింది నిజమేనని ఆయన ధ్రువీకరించారు. స్థానికంగా గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు. ప్రపంచానికి మెస్సీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే కొంతమంది దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మెస్సీ పేరు వాడుకుంటే పాపులర్ కావొచ్చన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చన్నారు.
కొంతకాలంగా ఇలాంటి దాడులు వరుసగా జరుగతున్నాయన్నారు. పోలీసులు సైతం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటివి చేస్తున్నారన్నారు. కాగా రొసారియో నగరం మెస్సీ స్వస్థలం. అయితే కొన్నేళ్లుగా రొసారియో నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. 2022లో రొసారియో నగరంలో 287 హత్యలు జరగడం సంచలనం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment