
లాస్ ఏంజిల్స్: రెండు నెలల కిందట గోల్ఫ్ స్టార్ టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వుడ్స్ కుడి కాలు విరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికారులు కీలకమైన వివరాలను వెల్లడించారు. ఆ సమయంలో టైగర్‌వుడ్స్ గంటకు 87 మైళ్ల (140 కిలోమీటర్లు) వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదే స్పీడుతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. లాస్ ఏంజిల్స్‌లోని రాంచోస్ పాలోస్ వెర్డస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
నిజానికి ఆ ప్రాంతంలో గంటకు 45 మైళ్ల వేగంతో వెళ్లడానికి అనుమతి ఉన్నా.. టైగర్‌వుడ్స్ మాత్రం దానికి రెట్టింపు వేగానికి మించి వెళ్లాడు. విచారణకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించడానికి వుడ్స్ అంగీకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వుడ్స్ ఉన్నట్లు కెప్టెన్ జేమ్స్ పవర్స్ చెప్పాడు. అయితే పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నట్లు తేలినా.. అక్కడ పోలీసు అధికారులుగానీ, ప్రత్యక్ష సాక్షులుగానీ లేకపోవడంతో టైగర్‌వుడ్స్‌పై ఎలాంటి క్రిమినల్ కేసూ పెట్టడం లేదు. ఒకవేళ తీవ్ర గాయాలు, మరణం, లేదా మరో వ్యక్తి ఈ ప్రమాదంలో ఉండి ఉంటే.. దీనిపై విచారణ కొనసాగించే వాళ్లమని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ప్రమాదంలో వుడ్స్ కాలు విరగడంతో అతనికి సర్జరీ చేసి రాడ్ వేశారు. దీంతో గురువారం ప్రారంభం కానున్న మాస్టర్స్ టోర్నీకి టైగర్‌వుడ్స్ దూరమయ్యాడు.
చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment