ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెక్ స్టేడియంలో ఈ నెల 25న ఇండియా–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న టీ–20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. దాదాపుగా 40 వేలకు పైగా క్రీడాభిమానులు మ్యాచ్ వీక్షించే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
క్రీడాకారులకు భారీ భద్రత
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులు, మ్యాచ్ రిఫరీకి కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం. ఎలాంటి సంఘటనలు జరక్కుండా చూస్తాం. అభిమానులు మితిమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
సాయంత్రం 4.30 నుంచి అనుమతి
►ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్రీడాభిమానులకు మధ్యాహ్నం 4.30 నుంచి స్టేడియంలోకి అనుమతి ఉంటుంది.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బెస్ట్
►మ్యాచ్‌కు వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకుంటే మంచిది.
►మ్యాచ్ సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు రైళ్లను నడుపుతుంది.
►ఆర్టీసీ అధికారులు కూడా వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి ప్రత్యేక షటిల్స్‌ను నడుపుతారు.
అడుగడుగునా నిఘా..
►ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 300 వరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది.
►బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వీటిని అనుసంధానం చేశాం.
►మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్‌లకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంది.
స్టేడియంలోకి ఇవి తేవొద్దు...
►హెల్మెట్, కెమెరాలు, బైనాక్యులర్స్, ల్యాప్‌ట్యాప్‌లు, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కాహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్, ఆయుధాలు, బ్లేడ్లు, చాకులు, మంచి నీటి బాటిల్స్‌ను స్టేడియంలోకి అనుమతించరు.
►ఏడు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతున్నాం. వీటితో పాటు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నాం.
►జీహెచ్‌ఎంసీ తరపున ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్‌ను అందుబాటులో ఉంచుతాం.
►మ్యాచ్ టికెట్లను బ్లాక్ దందా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. అవసరమైతే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి
►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మ్యాచ్ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.
►ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించమన్నారు.
►సికింద్రాబాద్ నుంచి, ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమన్నారు.
►గేట్–1 వీఐపీ ద్వారం పెంగ్విన్ గ్రౌండ్‌లో దాదాపు 1400 కార్లు పార్కు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
►స్డేడియం నలువైపులా ఐదు క్రేన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
►ద్విచక్ర వాహనాలను ఎన్‌జీఆర్‌ఐ గేట్–1 నుంచి నాలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దీంతోపాటు జెన్‌ప్యాక్ట్ వైపు రోడ్డులో కూడా ద్విచక్ర వాహనాలను పార్కు చేసుకోవచ్చన్నారు.
రూట్ మ్యాప్‌నకు ప్రత్యేక యాప్
►టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్ మెసేజ్ వస్తుందని, దీని ద్వారా ఏ గేట్‌కు వెళ్లి పార్కు చేసుకోవాలో డైరెక్షన్ చూపుతుందని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment