సిరీస్‌ విజయమే లక్ష్యంగా... | Today is Indias second ODI against South Africa | Sakshi
Sakshi News home page

సిరీస్‌ విజయమే లక్ష్యంగా...

Published Tue, Dec 19 2023 3:24 AM | Last Updated on Tue, Dec 19 2023 8:41 AM

Today is Indias second ODI against South Africa - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అదరగొట్టిన భారత జట్టు ఇప్పుడు అదే తరహాలో మరో గెలుపుపై కన్నేసింది. ఒక మ్యాచ్‌ ముందే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌ ఘన విజయం ఇచ్చి న ఉత్సాహం టీమిండియాలో కనిపిస్తుండగా... సొంతగడ్డపై అనూహ్యంగా 116 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా తమ టీమ్‌ ప్రదర్శనపై కొత్త సందేహాలు రేపింది.

మూడో టి20లో ఓటమి తర్వాత తొలి వన్డేలో ఆ జట్టు ఆటతీరు మరీ పేలవంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్‌ సిరీస్‌ అందుకుంటుందా లేక సఫారీ టీమ్‌ కోలుకొని తగిన రీతిలో బదులిస్తుందా అనేది చూడాలి.  

రజత్‌ పటిదార్‌కు అవకాశం! 
గత మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్‌‡్షదీప్, అవేశ్‌ ఖాన్‌ ప్రత్యర్థిని పడగొట్టగా... ఐదో బౌలర్‌ అవసరం కూడా రాకుండానే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్‌ ఆకట్టుకున్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో ఎలాంటి మార్పు అవసరం లేకుండానే జట్టు బరిలోకి దిగేది. అయితే టెస్టు సిరీస్‌ సన్నద్ధత కోసం శ్రేయస్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌ విభాగంలో ఒక ఖాళీ ఏర్పడింది.

చాలా కాలంగా తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌ పటిదార్‌కు నేరుగా చోటు దక్కనుంది. ఈ స్థానం కోసం రింకూ సింగ్‌ నుంచి కూడా పోటీ ఉన్నా... టి20 సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న రింకూకంటే రజత్‌కే మొదటి ప్రాధాన్యత దక్కనుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయని రాహుల్, సంజు సామ్సన్‌లు కూడా రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో మరోసారి కుల్దీప్‌ పదునైన బంతులను సఫారీలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  

హెన్‌డ్రిక్స్‌పై దృష్టి... 
దక్షిణాఫ్రికా కూడా గత ఓటమిని మరచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఎన్నో అంచనాలతో వన్డేల్లో వరుసగా అవకాశం దక్కించుకుంటున్న ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ పేలవంగా ఆడుతుండగా... డసెన్, మార్క్‌రమ్, మిల్లర్‌ కూడా ప్రభావం చూపలేకపోతున్నారు.

భారత గడ్డపై వరల్డ్‌ కప్‌లో చెలరేగిన క్లాసెన్‌ సొంత మైదానంలో మాత్రం ఇంకా తన స్థాయిని ప్రదర్శించలేదు. అనుభవం లేని బర్జర్, ముల్దర్‌ల బౌలింగ్‌ భారత్‌కు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. పిచ్‌ కారణంగా ఈ సారి కూడా ఇద్దరు స్పిన్నర్లు కేశవ్, షమ్సీ తుది జట్టులో ఉంటారు.  

పిచ్, వాతావరణం 
దక్షిణాఫ్రికా అత్యంత నెమ్మదైన మైదానాల్లో ఇదొకటి. సాధారణ పిచ్‌. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 ఏళ్లలో ఇక్కడ 8 వన్డేలు జరగ్గా... ఒక్కసారి కూడా స్కోరు 300 దాటలేదు. మ్యాచ్‌కు అనుకూల వాతావరణం ఉంది. వర్షసూచన లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement