కోహ్లి,కుల్దీప్
సెంచూరియన్: వన్డే సిరీస్‌లో శుభారంభం చేసిన కోహ్లి బృందం ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు సై అంటోంది. నేడు ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. చివరి టెస్టు, తొలి వన్డేలో విజయాల తర్వాత టీమిండియాలో ఉత్సాహం తొణికిసలాడుతుండగా, కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్ తడబాటును ఎదుర్కొంటోంది. ఇలాంటి స్థితిలో భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌పై మరింత పట్టు బిగుస్తుంది.
మార్పులు లేకుండానే...
తొలి వన్డేలో టీమిండియా ఆట చూస్తే జట్టులో ఒక్క మార్పుకు కూడా అవకాశం కనిపించదు. కోహ్లిని అడ్డుకోవడం దక్షిణాఫ్రికా బౌలర్ల వల్ల కావడం లేదు. భారత బ్యాటింగ్ వెన్నెముక అయిన కోహ్లిని నిరోధిస్తే విజయావకాశాలు పెరుగుతాయని దక్షిణాఫ్రికా చెబుతూ వచ్చింది. అదే కారణంగా కోహ్లి క్యాచ్‌ను స్లిప్‌లో పట్టుకునే క్రమంలోనే డివిలియర్స్, డు ప్లెసిస్ వేలికి గాయాలతో జట్టుకు దూరం కావడం యాదృచ్ఛికం! ధావన్, రోహిత్ తమదైన శైలిలో ఆడితే భారత్‌కు తిరుగుండదు. తన విలువేంటో రహానే గత మ్యాచ్‌లో చూపించాడు. 10 వేల పరుగులకు చేరువలో ఉన్న ధోని బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధం. మరో వైపు పేస్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రాల ప్రదర్శనపై ఎలాంటి అనుమానాలు లేవు. తొలి మ్యాచ్ ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ మరో ఆలోచన లేకుండా ఇద్దరు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను కొనసాగించడం ఖాయం. మొత్తంగా భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
అన్నీ సమస్యలే...
తొలి వన్డేలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సఫారీ బృందం చేతులెత్తేసింది. స్పిన్‌ను సమర్థంగా ఆడగల డివిలియర్స్ ముందే తప్పుకోగా, మరో బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ కూడా గాయపడటం ఆ జట్టును మరింత బలహీనపర్చింది. ఈ నేపథ్యంలో ఆమ్లాపై అదనపు భారం పడనుంది. దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో కోలుకోవాలంటే సీనియర్లు డుమిని, మిల్లర్ మిడిలార్డర్‌లో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. కెప్టెన్‌గా మార్క్‌రమ్ భారత్‌తో తొలి వన్డేకు ముందు తుది జట్టులో కూడా చోటు లేని పరిస్థితి... కానీ ఇప్పుడు 23 ఏళ్ల మార్క్‌రమ్‌కు ఏకంగా కెప్టెన్సీ అవకాశం లభించింది. కెరీర్‌లో 2 వన్డేలే ఆడిన మార్క్‌రమ్...ప్లెసిస్ స్థానంలో సిరీస్‌లోని మిగతా వన్డేలకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2014 అండర్–19 ప్రపంచకప్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు.
►మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ టెన్–1, 3లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment