మహిళల హాకీలో భారత్‌కు రెండో ఓటమి.. జర్మనీ చేతిలో 0-2తో పరాజయం | Tokyo Olympics 2020 Day 4 Updates And Highlights | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: కొనసాగుతున్న భారత పరాజయాల పరంపర.. మహిళల హాకీలోనూ ఓటమి

Published Mon, Jul 26 2021 7:17 AM | Last Updated on Mon, Jul 26 2021 8:19 PM

Tokyo Olympics 2020 Day 4 Updates And Highlights - Sakshi

కొనసాగుతున్న భారత పరాజయాల పరంపర.. మహిళల హాకీలోనూ ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత పరాజయాల పరంపర కొనసాగింది. ఇవాళ జర్మనీతో జరిగిన రెండో పూల్‌ మ్యాచ్‌లో భారత్‌ 0-2తేడాతో ఓటమిపాలైంది. జర్మనీ క్రీడాకారిణలు అన్నె ష్క్రోడర్‌, జెట్‌ ఫ్లెష్చుడ్చ్‌ చెరో గోల్‌ సాధించి ఆ జట్టును గెలిపించారు. దీంతో వరుసగా రెండో రోజు భారత్‌ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఇదిలా ఉంటే భారత ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పతకం మాత్రమే ఉంది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకాన్ని సాధించింది. 

హీట్స్‌లోనే స్విమ్మ‌ర్ స‌జ‌న్ ప్ర‌కాశ్ ఔట్‌
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశాజ‌న‌క‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతూ ఉంది. తాజాగా స్విమ్మ‌ర్ స‌జ‌న్ ప్రకాశ్ కూడా హీట్స్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. 200 మీట‌ర్ల బ‌ట‌ర్‌ఫ్లై హీట్ 2లో పోటీ ప‌డిన స‌జ‌న్‌.. నిమిషం 57.22 సెక‌న్ల‌లో రేస్‌ పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 5 హీట్స్ నుంచి 16 మంది సెమీఫైన‌ల్‌కు క్వాలిఫై కాగా.. స‌జ‌న్ మాత్రం 24వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

75 కేజీల విభాగంలో భారత బాక్సర్ ఆశిష్ కుమార్‌ ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో మ‌రో భారత బాక్స‌ర్ ఇంటిదారి ప‌ట్టాడు. పురుషుల 69-75 కేజీల మిడిల్ వెయిట్‌ విభాగంలో ఆశిష్ కుమార్ రౌండ్ ఆఫ్ 32 కూడా దాట‌లేక‌పోయాడు. చైనా బాక్స‌ర్ ఎర్బీకె తౌహెటా చేతిలో 0-5తో ఓడిపోయాడు. తొలి రెండు రౌండ్ల‌లో ఐదుగురు జ‌డ్జ్‌లు చైనా బాక్స‌ర్ వైపే మొగ్గు చూపారు. మూడో రౌండ్‌లో ఆశిష్ కాస్త కోలుకొని పైచేయి సాధించినా విజ‌యం మాత్రం తౌహెటానే వ‌రించింది. ఆశిష్ త‌న ప్ర‌త్య‌ర్థిపై పంచ్‌లు బాగానే విసిరానా.. చైనా బాక్స‌ర్ టెక్నిక‌ల్ గేమ్‌తో ఆశిష్‌ను బోల్తా కొట్టించాడు.

టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో మనిక బత్రా ఓటమిపాలైంది. మూడో రౌండ్‌లో  మనిక బత్రా ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవా చేతిలో 4-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. మొదటి సెట్‌ నుంచి ఆధిక్యం ప్రదర్శంచిన సోఫియా జోరు ముందు మనిక బత్రా నిలవలేకపోయింది. మానికా 8-11, 2-11, 5-11, 7-11 తేడాతో ఓటమి చెందింది.

పోరాడి ఓడిన సుమిత్ నగల్
టోక్యో ఒలింపిక్స్‌లో సుమిత్ నగల్‌  పోరాటం ముగిసింది. టెన్నిస్‌  పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగల్ ఓటిమి చెందాడు. రెండో రౌండ్‌లో వరల్డ్‌ నెం.1 డానిల్ మెడెదేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 1-6 తేడాతో ఓడిపోయాడు.

బ్యాడ్మింటన్ లో సాత్విక్  - చిరాగ్ శెట్టి ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత్ తరపున బరిలోకి దిగిన సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్ శెట్టి జోడి ఓటమి చెందింది. భారత్ పై ఇండోనేషియా జోడీ 21-13, 21-12తేడాతో విజయం సాధించింది. రెండో రౌండ్‌లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో సాత్విక్‌-చిరాగ్ శెట్టి జోడి గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు.  

క్వార్టర్స్‌లో ఆర్చరీ భారత పురుషుల జట్టు ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీమ్  కథ ముగిసిం‍ది. క్వార్టర్ ఫైనల్  లో భారత ఆర్చరీ పురుషుల జట్టు కొరియా చేతిలో  6-0 తేడాతో ఓటమి  చెందింది. వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారితో పాటు అథాను దాస్, అభిషేక్ వర్మ, ప్రవీణ్ జాదవ్ అందరూ ఫెయిల్ అయ్యారు.

టేబుల్‌ టెన్నిస్‌లో సుతీర్థ ముఖర్జీ ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో సుతీర్థ ముఖర్జీ  పోరాటం ముగిసింది.  టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో పోర్చుగల్‌ ప్లేయర్ చేతిలో సుతీర్థ ముఖర్జీ 4-0 తేడాతో ఓటమిపాలైంది. 

ఫెన్సింగ్‌లో భవానీ దేవి పరాజయం
ఒలింపిక్స్ అరంగేట్రంలోనే మెదటి మ్యాచ్లో శుభారంభం చేసిన భవానీ దేవి రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచులో 15-7 తేడాతో ఓడిపోయి ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది.

టేబుల్ టెన్నిస్ లో శరత్‌ కమల్‌ విజయం
టోక్యో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో అచంత్ శరత్ కమల్ రెండో రౌండ్‌లో 4-2తో పోర్చుగల్‌కు చెందిన టియాగోను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శరత్ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు.

ఒలింపిక్స్‌లో భారత మరో కేటగిరీపై ఆశలు పెంచుతోంది. నాలుగో రోజైన సోమవారం ఫెన్సింగ్‌(‍కత్తిసాము’, ఆర్చరీలో జయకేతనం ఎగరేసింది.  చెన్నైకి చెందిన భవానీ(2) ఫెన్సింగ్‌లో శుభారంభం చేయగా, మరోవైపు మెన్స్‌ ఆర్చరీ టీం విభాగంలో భారత్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ రెండో రౌండ్‌లో అచంత్ శరత్ కమల్ విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.


చరిత్ర సృష్టించిన భవానీ
ఇండియన్‌ ఫెన్సర్‌ భవానీ చరిత్ర సృష్టించింది. సోమవారం ట్యూనిషియా క్రీడాకారిణి నదియా  బెన్‌ అజిజ్‌తో జరిగిన పోరులో 15-3తో విజయం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌ డెబ్యూలో కేవలం ఆరు నిమిషాల 14 సెకండ్లలోనే మ్యాచ్‌ ముగించడం విశేషం. దీంతో తర్వాతి రౌండ్‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే ఇండియా నుంచి ఫెన్సింగ్‌ విభాగానికి అర్హత సాధించిన మొదటి క్రీడాకారిణి భవానీనే కావడం విశేషం. తర్వాతి రౌండ్‌లో వరల్డ్‌ 3 ర్యాంకర్‌, ఫ్రెంచ్‌ ఫెన్సర్‌ బ్రునెట్‌తో తలపడనుంది.


క్వార్టర్స్‌కు ఆర్చరీ టీం
పురుషుల ఆర్చరీ టీమ్‌ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత బృందం తొలి రౌండ్‌లో కజకిస్తాన్‌పై విజయం సాధించింది. 6-2 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా తలపడనుంది. ముఖ్యంగా అతాను దాస్ మంచి ఫర్‌ఫార్మెన్స్‌ కనబరిచాడు.

ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్
ఉ.5:30కి  మహిళల ఫెన్సింగ్ ఈవెంట్‌ క్వాలిఫికేషన్‌(భవానీ దేవి)
ఉ.6:00కి  పురుషుల ఆర్చరీ ఎలిమినేషన్‌(అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌)
ఉ.6:30కి షూటింగ్‌ పురుషుల స్కీట్‌ క్వాలిఫికేషన్‌ (బజ్వా, మీరజ్‌)
ఉ.6:30కి టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌(శరత్‌ కమల్‌ )
ఉ.8:30కి టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌(సుతీర్థ ముఖర్జీ)
ఉ.9:30‍కి  టెన్నిస్‌  పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌(సుమిత్‌ నగాల్‌)
మ.12:20కి షూటింగ్‌ పురుషుల స్కీట్‌ ఫైనల్‌
మ.1:00కి టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ (మనికా బాత్రా)
మ.3:06 కి బాక్సింగ్‌ పురుషుల ఫ్లైవెయిట్‌(ఆశీష్‌ కూమార్‌ రౌండ్‌ఆఫ్‌ 32)
మ.3:50కి స్విమ్మింగ్‌ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్‌-2(సాజన్‌ ప్రకాష్‌)
సా.5:45కి భారత్‌  Vs జెర్మనీ మహిళల హాకీ మ్యాచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement