
ధోని హెలికాప్టర్ షాట్లను మరిపించేలా స్మాష్ షాట్లను కొడుతూ.. కోహ్లి ఎక్కువగా ఆడే కవర్ డ్రైవ్‌ల వలే క్రాస్ షాట్స్‌ను ఆడుతూ.. సచిన్ ఫేవరెట్ షాట్ అయిన స్ట్రయిట్ డ్రైవ్ తరహాలో డ్రాప్ షాట్‌లను సంధిస్తూ.. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదుర్స్ అనిపించింది. వెరసి ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు మెడల్స్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ రోజు(ఆదివారం) జరిగిన కాంస్య పతక పోరులో సింధు చూడముచ్చటైన ఆట తీరుతో భారత ప్రేక్షకుల్ని మరిపించింది . నిన్న సెమీఫైనల్ పోరులో ఓటమిని పక్కన పెట్టిన సింధు.. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో మాత్రం అద్వితీయ ప్రదర్శన కనబరిచింది.
టోక్యో: మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్ జియావోతో జరిగిన పోరులో సింధు చెలరేగిపోయింది. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కూడా పతకం సాధించి భారత అభిమానులు పెట్టుకున్న ఆశల్ని వమ్ముచేయలేదు. ఫలితంగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు కొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించలేదనే బాధ ఒక్కటే తప్పితే ఓవరాల్‌గా యావత్ భారతావని మనుసుల్ని గెలిచింది సింధు.
ఏకపక్షంగా సాగిన పోరు
కాంస్య పతక పోరులో సింధు విజృంభించి ఆడింది. ఆది నుంచి కచ్చితమైన ప్రణాళికతో బింగ్ జియావోపై ఆధిపత్యం కనబరిచింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా క్రాస్ షాట్స్, డ్రాప్ షాట్స్, స్మాష్‌లను సంధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ప్రధానంగా తొలి గేమ్‌లో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని కనబరిచింది. ఆపై సింధు పాయింట్ కోల్పోయినా మళ్లీ వరుసగా మూడు పాయింట్లతో దూసుకుపోయింది. అటు తర్వాత 10,11,12,13,14 పాయింట్లను సింధు వరుసగా గెలుచుకుని మరింత ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. అదే ఊపును కడవరకూ కొనసాగిస్తూ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
ఇక రెండో గేమ్ ఆదిలో అదే జోరును కొనసాగించిన సింధు.. మధ్యలో కాస్త తడబడింది. కాస్త ఆసక్తికరంగా సాగిన రెండో గేమ్‌లో సింధు కడవరకూ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వచ్చింది. రెండో గేమ్ సగం ముగిసిన తర్వాత సింధు-బింగ్‌లు 11-11 సమంగా ఉండటంతో మ్యాచ్ టెన్షన్‌ను తలపించింది. కానీ సింధు స్మాష్‌లతో మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఎక్కువ భాగం వరుస పాయింట్లను సాధిస్తూ వెళ్లిన సింధు.. ప్రత్యర్థికి మాత్రం పెద్దగా అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్‌లో తొలి అర్థభాగం ముగిసిన తర్వాత సింధు 15-12, 18-14 తేడాతో భారీ తేడాను కొనసాగించింది. చివరకూ 21-15 తేడాతో బింగ్ జియావోను మట్టి కరిపించి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయంతో యావత్ భారతావని మనసులు గెలుచుకున్న మన సింధు.. కాంస్య మందారమే.
Comments
Please login to add a commentAdd a comment