ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మూడు పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్... ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... అంతర్జాతీయ టోర్నీ లలో క్రమం తప్పకుండా పసిడి, రజత పతకాలు... అయితేనేం ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత క్రీడా వేదికపై తొలిసారి ఆడుతున్న బజరంగ్ అసలు సిసలు సత్తా చాటాల్సిన చోట తడబడ్డాడు. తొలి రౌండ్‌లో అంతగా అంతర్జాతీయ అనుభవంలేని కిర్గిజిస్తాన్ రెజ్లర్‌పై అతికష్టమ్మీద నెగ్గిన అతను, క్వార్టర్ ఫైనల్లో ఇరాన్ ప్రత్యర్థిని ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించినా... కీలకమైన సెమీఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో స్వర్ణ–రజత పతకాలపై ఆశలు వదులుకొని ఇక కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు.
టోక్యో: తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించేందుకు భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో 27 ఏళ్ల బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. దాంతో నేడు జరిగే కాంస్య పతక పోరులో దౌలత్ నియాజ్‌బెకోవ్ (కజకిస్తాన్)–ఆడమా దియాతా (సెనెగల్) మధ్య ‘రెపిచేజ్’ బౌట్ విజేతతో బజరంగ్ తలపడనున్నాడు. అనుభవం, గత రికార్డుల దృష్ట్యా రెపిచేజ్ బౌట్‌లో నియాజ్‌బెకోవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నియాజ్‌బెకోవ్‌తో బజరంగ్ ఆడాల్సి వస్తే మాత్రం భారత రెజ్లర్ గెలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. 32 ఏళ్ల నియాజ్‌బెకోవ్ మూడుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలువడంతోపాటు 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో బజరంగ్‌ను ఓడించాడు.
వివిధ వయో కేటగిరీల్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హాజీ అలియేవ్ (అజర్‌బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 5–12 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. బజరంగ్ లోపాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు అలియేవ్ ఆడాడు. బజరంగ్ లెగ్ డిఫెన్స్‌లో బలహీనంగా ఉండటంతో అలియేవ్ భారత రెజ్లర్ కాళ్లను ఒడిసి పట్టుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తొలి భాగంలో 2, 2 పాయింట్లు స్కోరు చేసిన అలియేవ్ ఒక పాయింట్ కోల్పోయాడు. రెండో భాగంలోనూ అలియేవ్ దూకుడు కొనసాగించగా... బజరంగ్ కూడా కౌంటర్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండుసార్లు సఫలమై 2, 2 పాయింట్లు సాధించాడు. అయితే అలియేవ్ ఒత్తిడికి లోనుకాకుండా బజరంగ్ రెండు కాళ్లను పట్టేసి రెండుసార్లు తిప్పేసి 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత 1, 2 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని 11–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో బజరంగ్ రిఫరీ నిర్ణ యాన్ని చాలెంజ్ చేసి దానిని కోల్పోవడం తో అలియేవ్ ఖాతాలో మరో పాయింట్ చేరింది.
అంతకుముందు తొలి రౌండ్‌లో బజరంగ్ 3–3తో ఎర్నాజర్ అక్మతలియేవ్ (కిర్గిజిస్తాన్)పై గెలుపొందాడు. తొలి భాగంలో బజరంగ్ 1, 2 పాయింట్లు సాధించి, మరో పాయింట్ చేజార్చుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో భాగంలో ఎర్నాజర్ వరుసగా 1, 1 పాయింట్లు సాధించి స్కోరును 3–3తో సమం చేశాడు. బౌట్ ముగిశాక ఇద్దరూ సమఉజ్జీగా నిలిచినా నిబంధనల ప్రకారం బజరంగ్ ఒకే ఎత్తులో హై స్కోరింగ్ (2) పాయింట్లు సాధించ డంతో అతనిని విజేతగా ప్రకటించారు.
‘బై ఫాల్’తో విక్టరీ...
ఇరాన్ రెజ్లర్ మొర్తజా ఘియాసి చెకాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 4 నిమిషాల 56 సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో గెలిచాడు. తొలి భాగం ముగిశాక 0–1తో వెనుకబడ్డ బజరంగ్ రెండో భాగం ఆరంభంలో 2 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఇరాన్ ప్రత్యర్థిని కింద పడేసి అతని భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించాడు. దాంతో నిబంధనల ప్రకారం బజరంగ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు.
సీమా తొలి రౌండ్‌లోనే...
మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో నిలిచిన చివరి రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. సారా హమ్దీ (ట్యునీషియా)తో జరిగిన తొలి రౌండ్లో సీమా 1–3తో ఓటమి పాలైంది. ఆ తర్వాత సారా హమ్దీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో సీమాకు రెపిచేజ్ పద్ధతిలో కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం కూడా చేజారింది.
Comments
Please login to add a commentAdd a comment