15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. అరంగేట్రంకు ముందే అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ఎంపికైన వైభవ్‌ను ఇప్పుడు టెస్టుల్లోకి కూడా తీసుకుంటే బాగుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ అనధికారిక టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన వీడియోనూ ఎక్స్‌లో షేర్ చేసుకున్నారు. 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా యూత్ టెస్టు మ్యాచ్ ఆడింది.
ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ ఆడిన వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని అనధికారిక టెస్టులోనూ కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో 86 బంతుల్లో 113 పరుగులు చేసిన సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశాడు.
అంతేకాదు వైభవ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టెస్టులోనూ టీ20 తరహా ఆటతో విజృంభించిన వైభవ్‌ను సంప్రదాయ క్రికెట్‌లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి.
ఐపీఎల్‌కు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు చాలా తేడా ఉంటుందని, మొదట టీ20 ఫార్మాట్‌లో తనను తాను నిరూపించుకోవాలని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.
Just look at the dominance of Vaibhav Suryavanshi in test cricket.🤯
- Vaibhav Suryavanshi playing test cricket like T20.😊pic.twitter.com/NvljSRcTAi— Cricket Central (@CricketCentrl) June 5, 2026


