వినేశ్‌ విషయంలో అసలేం జరిగింది?.. బ్రిజ్‌భూషణ్‌ కుమారుడి రియాక్షన్‌ | Olympics 2024: Vinesh Phogat Uncle Mahavir Phogat And Brij Bhushan Son Reacts On Her Disqualification | Sakshi
Sakshi News home page

Vinesh Phogat: ‘దంగల్‌’ మహవీర్‌ కన్నీటి పర్యంతం.. బ్రిజ్‌ భూషణ్‌ కుమారుడి రియాక్షన్‌ ఇదే

Published Wed, Aug 7 2024 2:10 PM | Last Updated on Wed, Aug 7 2024 7:03 PM

Vinesh Phogat Uncle Mahavir Phogat And Brij Bhushan Son Reacts Rule Says

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పసిడి పతకం ఖాయమని మురిసిపోయిన భారతీయల హృదయాలు ముక్కలయ్యాయి. మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. మన అమ్మాయి ‘బంగారం’తో తిరిగి వస్తుందనుకుంటే కన్నీళ్లే మిగిలాయి.

ఆటలోనే కాదు.. సహచరులకు న్యాయం చేయాలనే పట్టుదలతో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్న ఈ హర్యానా రెజ్లర్‌ అనూహ్య రీతిలో పతక రేసు నుంచి నిష్క్రమించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినేశ్‌ విజయాలను ఓర్వలేక కుట్ర జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఫైనల్‌ వరకు సజావుగా సాగిన ఆమె ప్రయాణం ఇలా పతకం లేకుండా ముగిసిపోవడం పట్ల భావోద్వేగానికి గురవుతున్నారు.

మీరేమీ నిరాశ చెందవద్దు
కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే.. వేటు వేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినేశ్‌ అంకుల్‌, ‘దంగల్‌’ మహవీర్‌ ఫొగట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఆమె స్వర్ణంతో తిరిగి వస్తుందని దేశమంతా ఆశిస్తోంది.

అయితే, కేవలం 50- 100 గ్రాముల ఎక్కువ బరువు ఉన్నా కొన్నిసార్లు బౌట్‌కు అనుమతిస్తారు. దేశ ప్రజలారా.. మీరేమీ నిరాశ చెందవద్దు. ఏదో ఒకరోజు వినేశ్‌ కచ్చితంగా దేశానికి పతకం తెస్తుంది. వచ్చే ఒలింపిక్స్‌ కోసం నేను ఆమెను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తాను’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా హర్యానాకు చెందిన మహవీర్‌ ఫొగట్‌ మల్లయోధుడు. తన కూతుర్లను రెజ్లర్లుగా తీర్చిదిద్దిన కోచ్‌. మహవీర్‌ సోదరుడి కుమార్తే వినేశ్‌. ఆమె కూడా మహవీర్‌ శిక్షణలో రాటుదేలింది. కాగా మహవీర్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో దంగల్‌ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ మహవీర్‌ పాత్రను పోషించాడు.

బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ కుమారుడి స్పందన
ఇక రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొంతమంది మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. వారికి మద్దతుగా వినేశ్‌ ఫొగట్‌ ఢిల్లీలో పోరాటానికి దిగారు. బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరులతో కలిసి ఉద్యమం ఉధృతం చేశారు. 

ఈ క్రమంలో అరెస్టయ్యారు కూడా! అయితే, బ్రిజ్‌భూషణ్‌పై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అతడు పదవి నుంచి తప్పుకొన్నాడు. బీజేపీ సైతం అతడికి టికెట్‌ ఇవ్వలేదు. అయితే, అతడి కుమారుడిని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది.

ఇక వినేశ్‌ ఫొగట్‌పై వేటు నేపథ్యంలో బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ కుమారుడు, బీజేపీ ఎంపీ కరణ్‌ భూషణ్‌ సింగ్‌ స్పందించాడు. ‘‘దేశం మొత్తానికి తీరని లోటు. ఈ విషయాన్ని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ లోతుగా పరిశీలించి.. అవసరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు.. ఒలింపిక్‌ పతక విజేత విజేందర్‌ సింగ్‌ మాత్రం వినేశ్‌ విషయంలో కుట్ర జరిగిందని.. ఆమెకు కావాల్సినంత సమయం ఇవ్వలేదని ఆరోపించాడు. ఆప్‌ సైతం భారత్‌ ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేసింది.

నిబంధనలు ఇలా..
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పోటీల్లో భాగంగా.. ఆయా విభాగాల్లో పోటీపడుతున్న ప్లేయర్ల బరువును.. ఏ రోజైతే బౌట్ ఉంటుందో ఆరోజు ఉదయం తూస్తారు. ప్రతి వెయిట్‌ క్లాస్‌లో పోటీపడే అథ్లెట్లకు తగినంత సమయం ఉంటుంది. రెండు రోజుల వ్యవధిలో తొలి రోజు బరువు కొలిచేందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో ఎన్నిసార్లైనా బరువు కొలుచుకోవచ్చు. అయితే, రెండోరోజు మాత్రం ఇందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. ఈలోపు నిర్ణీత బరువు ఉంటేనే బౌట్‌కు అనుమతిస్తారు.

కాగా బరువు తూచే సమయంలో కేవలం స్లీవ్‌లెస్‌ గార్మెంట్‌ తప్ప ఇతర దుస్తులేవీ ధరించకూడదు. గోళ్లు పూర్తిగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇక బౌట్‌కు ముందు రెజ్లర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

చదవండి: Vinesh Phogat: ఆస్పత్రి పాలైన వినేశ్‌.. కారణం ఇదే!
వినేశ్‌ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement