దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించారు. బుధవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కోహ్లి 871 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ 855 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచాడు. వీరి తర్వాత బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 911 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా... విరాట్ కోహ్లి (886 పాయింట్లు), మార్నస్ లబ్‌షేన్ (827 పాయింట్లు) తర్వాతి రెండు స్థానాలను సాధించారు.
పాకిస్తాన్‌తో మూడో టెస్టులో 267 పరుగులు సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ 53 స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్‌లో అత్యుత్తమంగా 28వ ర్యాంకుకు చేరుకున్నాడు. టి20 కేటగిరీలో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రెండో ర్యాంకులో ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంకును, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా, 904 పాయింట్లు), వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, 722 పాయింట్లు), టి20ల్లో రషీద్ ఖాన్ (736 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 719 పాయింట్లతో భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ వన్డేల్లో రెండో ర్యాంకులో... టెస్టులు, టి20ల్లో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment