ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌటైన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో విరాట్ ఆజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను కోహ్లి అలరించాడు.
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు రోహిత్ శర్మ ((125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121) శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలోనే చేధించింది. కాగా ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..
👉అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డే, టీ20లు కలిపి 18437 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ రెండు వైట్ బాల్ ఫార్మాట్‌లు కలిపి 18436 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు. అయితే సచిన్ తన కెరీర్‌లో భారత్ తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు.
👉అదేవిధంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. సచిన్ తన కెరీర్‌లో వన్డే రన్ చేజ్‌లో 70 హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లి కూడా సరిగ్గా 70 ఆర్ధ శతకాలు సాధించాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే సచిన్‌ను విరాట్ అధిగమిస్తాడు.
👉వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా కుమర సంగక్కర రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. సంగక్కర 380 ఇన్నింగ్స్‌లలో14234 పరుగులు చేయగా.. కోహ్లి కోహ్లి ఇప్పటివరకు 293* ఇన్నింగ్స్‌లో 14255 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో సచిన్(18426 పరుగులు) అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే!


