
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు కఠోరంగా శ్రమించారు. నెట్స్‌లో గంటల కొద్ది చెమటోడ్చారు. జట్టులో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండే ఆస్కారం ఉన్న వారు మరింత ఎక్కువగా కష్టపడ్డారు. మ్యాచ్ ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరం సాగింది.
ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు ఆసక్తి రేకెత్తించింది. విరాట్, బుమ్రా నెట్స్‌లో ఒకరి ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. బుమ్రా రెగ్యులర్ మ్యాచ్ తరహాలో నిప్పులు చెరుగుతూ బౌలింగ్ చేయగా.. విరాట్ కూడా అంతే సీరియస్‌గా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా, కోహ్లి మధ్య జరిగిన పోటీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ తరంలో ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
VIRAT KOHLI vs JASPRIT BUMRAH WITH PINK BALL...!!!!
- The Battle between the Greatest of this Generation. 🐐 pic.twitter.com/xsUkB6rQfV— Johns. (@CricCrazyJohns) December 4, 2024
మరోవైపు కోహ్లి, బుమ్రాతో పాటు రోహిత్ శర్మ కూడా చాలా సేపు నెట్స్‌లో గడిపాడు. నెట్స్‌లో రోహిత్ డిఫెన్స్‌పై ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ప్రాక్టీస్ కూడా జోరుగా సాగింది. హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్ కూడా ప్రాక్టీస్‌లో మునిగి తేలారు. రెండో టెస్ట్ తుది జట్టులో ఎవరుంటారో తెలియదు కాని, జట్టు మొత్తం ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.
గత పర్యటనలో భారత్ పింక్ బాల్ టెస్ట్‌లో ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పింక్ బాల్ టెస్ట్‌లో ఆసీస్‌కు ఓటమి రుచి చూపించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. తొలి టెస్ట్ ఫామ్‌ను టీమిండియా ఆటగాళ్లు కొనసాగిస్తే ఆసీస్‌కు చుక్కెదురవడం ఖాయం.
కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు నుంచి బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ నడ్డి విరిచాడు. సిరాజ్ 5, హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆసీస్‌పై ముప్పేట దాడి చేశారు.