టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తాను టీమిండియా క్రికెటర్ కావాలని, అలాగే పెద్దయ్యాక హీరోయిన్‌ను పెళ్లాడాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడట. టీమిండియా క్రికెటర్ కావాలన్నది తన ధ్యేయమని, చిన్నతనంలో తన స్నేహితుడి (షలజ్ సోంధి) స్లాం బుక్‌లో రాసిన కోహ్లి.. అదే స్నేహితుడి తల్లితో తాను హీరోయిన్‌ను పెళ్లాడతానని అప్పుడే చెప్పాడట. కోహ్లి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఆసక్తికర విషయాలను ఆర్సీబీ ఇటీవలే ఓ ప్రత్యేక వీడియోలా రూపొందించి సోషల్‌మీడియాలో విడుదల చేసింది.
Stories from Virat Kohli’s childhood in Delhi
— Royal Challengers Bangalore (@RCBTweets) May 5, 2023
We met Virat’s first coach Rajkumar Sharma, childhood friend Shalaj & his mother, and they tell us beautiful unheard anecdotes from Virat’s early days as a budding cricketer in Delhi, on @HombaleFilms brings to you Bold Diaries.… pic.twitter.com/wzbpeoTxfu
కోహ్లి గొప్ప క్రికెటర్ అవుతాడని ముందే తెలుసు..
ఈ వీడియోలో కోహ్లి చిన్ననాటి గురువు రాజ్‌కుమార్ శర్మ, అతని చిన్ననాటి నేస్తం షలజ్ సోంధి, సోంధి తల్లి.. కోహ్లితో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. కోహ్లి చిన్నతనం నుంచే చాలా యాక్టివ్‌గా ఉండేవాడని, 10 ఏళ్ల వయసులోనే అతను పెద్దపెద్ద లక్ష్యాలను పెట్టుకునే వాడని, కోహ్లి ఓ నాచురల్ టాలెంటెడ్ ఆటగాడని, అతను పెద్దయ్యాక తప్పక గొప్పవాడవుతాడని తాను ముందే గుర్తించానని కోహ్లి గురువు రాజ్‌కుమార్ శర్మ అన్నాడు.
టీమిండియా క్రికెటర్ కావాలన్న కోరిక..
కోహ్లి స్నేహితుడు షలజ్ మాట్లాడుతూ.. కోహ్లి చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడని, ప్రాక్టీస్ అవ్వగానే తాము స్ట్రీట్ ఫుడ్ వేటలో పడే వారమని తెలిపాడు. షలజ్.. కోహ్లికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సైతం వెల్లడించాడు. కోహ్లి చిన్నతనంలోనే భారత క్రికెటర్ కావాలని యాంబిషన్‌గా పెట్టుకున్నాడని, చీకూ (కోహ్లి ముద్దు పేరు).. దాన్ని తన కఠిన దీక్షతో నెరవేర్చుకున్నాడని తెలిపాడు.
హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాను..
కోహ్లికి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని కోహ్లి స్నేహితుడు సోంధీ తల్లి షేర్ చేసుకున్నారు. తాను చిన్నతనంలో సోంధీ అతని గ్యాంగ్‌కు తిండి పట్టుకెళ్లేదాన్నని, ఓ రోజు కోహ్లి గోడపై ఉన్న పోస్టర్‌ను చూపిస్తూ.. నా ఫోటో కూడా ఓ రోజు ఇలాగే పోస్టర్‌పై ఉంటుందని, తాను పెద్దయ్యాక హీరోయిన్‌ను పెళ్లాడతానని చెప్పాడని సోంధి తల్లి చెప్పుకొచ్చింది.
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను..
2005లో 17 ఏళ్ల కోహ్లి.. తాను క్రికెట్ ప్రపంచాన్ని శాసించబోతున్నాని తెలిపినట్లు స్టార్ మహిళా క్రికెటర్లు హీలీ, పెర్రీ వెల్లడించారు. కోహ్లికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికర విషయాలన్నిటితో కూడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, కోహ్లి అనుకున్నట్లుగానే టీమిండియా క్రికెటర్ అయ్యాడు, చెప్పినట్లుగానే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, అలాగే తాను ఆశించినట్లు హీరోయిన్‌ను (అనుష్క శర్మ) పెళ్లాడాడు.
Comments
Please login to add a commentAdd a comment