టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ జట్టుకు విజయం అందించాడు. దీంతో వీరూ భాయ్ వారసుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా వినూ మన్కడ్ ట్రోఫీ-2024 సందర్భంగా ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ తరఫున ఎంట్రీ ఇచ్చాడు.
బౌలర్లు పడగొట్టారు
పాండిచ్చేరి వేదికగా మణిపూర్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో మణిపూర్ 49.1 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లక్ష్మణ్(24/3), దేవాన్ష్ రావత్(44/2), అమన్ చౌదరి(29/2) అదరగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్- సార్థక్ రే శుభారంభం అందించారు.
ఇద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 33 పరుగులు చేశారు. సార్థక్ 17 బంతుల్లో 25 పరుగులు చేసి తొలి వికెట్‌గా నిష్క్రమించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య కుమార్ ఎనిమిది పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ ప్రణవ్ పంత్‌తో కలిసి ఆర్యవీర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ 20 ఓవర్లలోనే వంద పరుగుల మార్కు అందుకుంది.
మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్ 49 పరుగుల వద్ద అవుటయ్యాడు. తృటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు.. ప్రణవ్ పంత్ కూడా 45 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఏకంగా 75 రన్స్ సాధించాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో మణిపూర్‌పై గెలుపొందింది.
కాగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ట్రయల్ మ్యాచ్‌లో ఆర్యవీర్ దుమ్ములేపాడు. 136 బంతుల్లోనే ఏకంగా 183 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వినూ మన్కడ్ వన్డే టోర్నీకి ఢిల్లీ సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలా సత్తా చాటి వారి నమ్మకాన్ని ఆర్యవీర్ నిలబెట్టాడు.
ఇద్దరు కుమారులు
2004లో ఆర్తీ అహ్లావత్‌ను పెళ్లాడిన వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్దవాడు ఆర్యవీర్(2007), చిన్నోడు వేదాంత్(2010). ఇద్దరూ క్రికెటర్లుగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment