టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రాంచీ వేదికగా జరిగిన తొలి టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందు బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లతో పాటు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అర్థసెంచరీతో రాణించాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 151 పరుగులు చేయగలిగిదంటే అదంతా సుందర్ చలవే.
మధ్యలో సూర్యకుమార్, పాండ్యాలు ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టినప్పటికి స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడం టీమిండియాను దెబ్బతీసింది. ఆ తర్వాత టీమిండియాను నడిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న సుందర్ 28 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. కానీ చివర్లో రన్‌రేట్ పెరిగిపోవడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత్ ఓడినా సుందర్ మాత్రం తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
మ్యాచ్ అనంతరం సుందర్ మీడియాతో మాట్లాడాడు. '' నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా జట్టు ఓటమి బాధ కలిగించింది. అయినా ఇది ఒక మ్యాచ్ మాత్రమే. ఓడినప్పుడు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉండడం సహజం. ఐపీఎల్ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలా వికెట్లు తీశారు.. బ్యాటర్లు పరుగులు రాబట్టారు. కానీ కివీస్‌తో టి20 మ్యాచ్‌లో రాణించలేకపోయాం'' అని చెప్పుకొచ్చాడు.
రాహుల్ త్రిపాఠి
అయితే సుందర్ సమాధానంతో ఏకీభవించని ఒక జర్నలిస్ట్ తిక్క ప్రశ్న వేశాడు. ''మ్యాచ్‌లో ఓడిపోయారు.. టాపార్డర్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా'' అని ప్రశ్నించాడు. అయితే సుందర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ''నిజంగా టాపార్డర్ మార్చాల్సిన అవసరం ఉందంటారా.. ఒక్క విషయం చెబతున్నా.. రెస్టారెంట్ నుంచి మనకు కావాల్సిన ఫెవరెట్ బిర్యానీ రాకపోతే.. మళ్లీ సదరు రెస్టారెంట్‌కు పూర్తిగా వెళ్లడం మానేస్తారా చెప్పండి. ఇది అలాంటిదే.. ఇది కేవలం ఒక మ్యాచ్. రోజులో ముగిసేపోయే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే నెగ్గుతుంది. ఇరుజట్లు కలిపి ఒకేసారి 22 మంది ఆటగాళ్లు ఒకే రకమైన ప్రదర్శన కనబరచలేరు. రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ కావడం గమనించండి. ఒక్క మ్యాచ్‌కే టాపార్డర్ మార్చాలనడం కరెక్ట్ కాదు'' అని పేర్కొన్నాడు.
ఇక అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు సుందర్ మద్దతు తెలిపాడు. ''అర్ష్‌దీప్ సింగ్ టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా వికెట్లు తీశాడు. మేం కూడా మనుషులమే. మాకు ఆడాలని ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బలంగా ఉన్నప్పుడు ఆరోజు వాళ్లదే ఆట అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. 4 ఓవర్లలో 51 పరుగులిచ్చినప్పటికి వికెట్ తీశాడు. వచ్చే మ్యాచ్‌లో అర్ష్‌దీప్ నుంచి మంచి ప్రదర్శన వచ్చే అవకాశం ఉంది.'' అంటూ వెల్లడించాడు.
''గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసరడం ఉమ్రాన్ మాలిక్ ప్రత్యకం. అతనిలో ఉన్న నైపుణ్యం అదే.. ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ కావొచ్చు.. అతన్ని ప్రోత్సహించాల్సిందే . భారత్ లాంటి పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ సేవలు అవసరం. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కొంత సహనం, ఓర్పు వహించాల్సిందే. మ్యాచ్ ఓడిపోయాం.. దానినే పట్టుకొని వేళాడితే కుదరదు.. ముందుకు వెళ్లాల్సిందే.'' అంటూ వివరించాడు.
''డారిల్ మిచెల్ ప్రదర్శన మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఒక దశలో న్యూజిలాండ్‌ను కట్టడి చేసినట్లే అనిపించినా.. డారిల్ మిచెల్ అద్బుత బ్యాటింగ్‌తో మెరిశాడు. కఠినంగా ఉన్న పిచ్‌పై 30 బంతుల్లో 59 పరుగులు చేసి న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించడానికి తోడ్పడ్డాడు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 లక్నో వేదికగా ఆదివారం(జనవరి 29న) జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment