India Vs Pakistan: ‘‘గత కొంత కాలంగా అతడి ఆటతీరును ఒక్కసారి గమనిస్తే.. ఐపీఎల్-2022 సందర్భంగా తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జట్టును విజయవంతంగా ముందుకు నడిపాడు. టైటిల్ గెలిచాడు. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఒత్తిడిని అధిగమించిన తీరు అమోఘం. ముఖ్యంగా ఫినిషర్‌గా బాధ్యతను నెరవేర్చిన తీరు అద్భుతం’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు.
మానసికంగా దృఢంగా ఉండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో పాండ్యా నిరూపించాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2021 తర్వాత పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ సాధించే క్రమంలో చాలా కాలం భారత జట్టుకు దూరమైన అతడు.. ఐపీఎల్-2022తో తొలిసారిగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే జట్టును విజేతగా నిలిపాడు.
పునరాగమనంలో అదరగొట్టి
ఈ క్రమంలో టీమిండియాలో పునరాగమనం చేసి భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి పలు సిరీస్‌లు గెలిచాడు. ఇక ఆసియాకప్-2022లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో.. ప్రపంచకప్-2022లో దాయాదితో పోరులో విరాట్ కోహ్లితో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
తదుపరి కెప్టెన్ అతడే
ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన విధానాన్ని పాకిస్తాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు. ఇక వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ముందు తను ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ట్రోఫీ గెలిచాడు.
ఇప్పుడు జట్టులో తను కీలక సభ్యుడు మాత్రమే కాదు.. కెప్టెన్‌కు సలహాలు ఇవ్వగల స్థాయిలో ఉన్నాడు. జట్టు జయాపజయాలపై తన ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తను టీమిండియా తదుపరి కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు.
అసలైన పోరులో కీలక పాత్ర
ఆసియాకప్-2022లో పాక్‌తో తొలి మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన హార్దిక్ పాండ్యా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత 17 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన హార్దిక్.. 37 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లికి సహకరిస్తూ అతడితో కలిసి జట్టును గెలిపించాడు.
చదవండి: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా..
Comments
Please login to add a commentAdd a comment