ICC ODI WC 2023- Aus Vs Pak- Babar Azam Comments On Loss: ‘‘మా స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. ఇక వార్నర్ లాంటి బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ జారవిడిస్తే.. అతడు వదిలిపెడతాడా? కచ్చితంగా మనం మూల్యం చెల్లించుకునేలా చేస్తాడు. నిజానికి ఈ గ్రౌండ్‌లో భారీ స్కోర్లు సాధారణమే.
మా లక్ష్యం కూడా మరీ ఛేదించలేనిదైతే కాదు. ఏదేమైనా మా ఫాస్ట్‌బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి ఓవర్లలో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకునేలా చేశారు. మేము టార్గెట్ ఛేజ్ చేయగలమనే సందేశాన్ని ఇచ్చారు.
గతంలో ఇలాంటివి మాకు అనుభవమే. కానీ ఈరోజు అలా జరుగలేదు. మిడిల్ ఓవర్లలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు.
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు.. పాక్‌ను 62 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.
వార్నర్, మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బాబర్ ఆజం బృందం.. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)లను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది. వారిద్దరిని అవుట్ చేసినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డుపై భారీ స్కోరుకు పునాది పడింది.
ఆరంభంలో వార్నర్ ఇచ్చిన క్యాచ్‌లను రెండుసార్లు మిస్ చేయడంతో పాక్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న పాక్ బౌలర్లు ఆసీస్ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌ను దాదాపు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసినా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
ఓపెనింగ్ జోడీ శుభారంభం.. కానీ
నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అత్యధికంగా 5 వికెట్లు దక్కాయి. ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(64), ఇమామ్ ఉల్ హక్(70) శుభారంభాలు అందించినా.. కెప్టెన్ బాబర్ ఆజం 18 పరుగులకే పెవిలియన్ చేరడం ప్రభావం చూపింది.
మిగతా వాళ్లలో మహ్మద్ రిజ్వాన్ 46, సౌద్ షకీల్ 30, ఇఫ్తికర్ అహ్మద్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ ఆడం జంపా ఆది నుంచే ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా 45.3 ఓవర్లలో 305 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది.
ఓటమికి ప్రధాన కారణం అదే
ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం.. ‘‘ఆసీస్ ఇన్నింగ్స్‌లో తొలి 10 ఓవర్లలో మా బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సింది. అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు ఇంకాస్త బెటర్‌గా ఆడితే బాగుండేది’’ అంటూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో మెరిసిన డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. పాండ్యా అవుట్.. ఇక
Comments
Please login to add a commentAdd a comment