
ICC Cricket World Cup 2023- India vs Bangladesh, 17th Match: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన గురువారం మరో గెలుపు నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో విజయం అందుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 తరహా దూకుడుకు తోడు.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సంచలన శతకంతో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో 78వ సెంచరీ నమోదు చేస్తాడా అన్న ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు 103 పరుగులతో మెరిసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.
బంగ్లా శుభారంభం చేసినా
పుణె వేదికగా సాగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా.. లోయర్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం 38, మహ్మదుల్లా 46 పరుగులతో రాణించారు.
ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టీ20 తరహాలో రోహిత్ దూకుడు
ఇక శాంటో బృందం విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాడు. టీమిండియా ఇన్నింగ్స్ రెండో బంతికే ఫోర్ బాదిన హిట్‌మ్యాన్ మొత్తంగా 40 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు.
తాను కూడా తక్కువేం కాదన్న గిల్
తృటిలో అర్ధ శతకం చేజారినా క్రీజులో ఉన్నంతసేపు.. టీ20 తరహాలో పూర్తి వినోదం అందించాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నెమ్మదిగా ఆరంభించినా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 55 బంతుల్లో 53 పరుగులు రాబట్టాడు. ఈ పంజాబీ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
రికార్డుల రారాజు కింగ్ కోహ్లి సంచలన శతకం
మరోవైపు వన్‌డౌన్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే కెరీర్‌లో 48వ అంతర్జాతీయ శతకం నమోదు చేసి.. కేఎల్ రాహుల్(34- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ(103)తో జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో 78వ శతకం నమోదు చేశాడు.
చదవండి: #Virat Kohli: కోహ్లి సరికొత్త చరిత్ర.. జయవర్దనే రికార్డు బద్దలు! ఇక మిగిలింది ఆ ఇద్దరు.. తర్వాత