భారత క్రికెట్‌లో నూతన శకానికి నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండా టీ20ల్లో టీమిండియా. భారత హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే టూర్.
యూరో ఫుట్‌బాల్ కప్‌లో ఫైనల్‌కు చేరిన స్పెయిన్, ఇంగ్లండ్. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన నొవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్‌కరాజ్ వంటి ఈ వారంలో జరిగిన ముఖ్యమైన క్రీడా ఆంశాలపై ఓ లుక్కేద్దాం.
భారత హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్..
భారత క్రికెట్‌లో నూతన శకానికి బీసీసీఐ నాంది పలికింది. టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గంభీర్.. ద్రవిడ్ వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోచ్‌గా గంభీర్‌కు తొలి పరీక్ష. టీ20 వరల్డ్‌కప్-2024తో హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే భారత్..
టీ20 వరల్డ్‌కప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. దీంతో రోహిత్, విరాట్ లేకుండానే భారత్ టీ20ల్లో ఆడుతోంది. టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది.
శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా..
యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తొలిసారి భారత సీనియర్ జట్టు పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. సీనియర్ ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
అయితే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన ఆదిలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. తొలి టీ20లో ఆతిథ్య జట్టులో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆ తర్వాత దెబ్బతిన్న సింహంలా గర్జించిన భారత జట్టు.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
ఈ సిరీస్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన సెంచరీతో మెరిశాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. కెప్టెన్ శుబమన్ గిల్ సైతం తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
యూరో కప్ ఫైనల్‌కు చేరిన స్పెయిన్, ఇంగ్లండ్..
యూరో ఫుట్‌బాల్ కప్-2024 ఫైనల్‌కు స్పెయిన్, ఇంగ్లండ్ జట్లు చేరాయి. తొలి సెమీఫైనల్‌లో 2-1 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి ఇంగ్లండ్ తుది పోరుకు ఆర్హత సాధించింది. ఆదివారం(జూలై 14) జరగనున్న ఫైనల్ పోరులో స్పెయిన్, ఇంగ్లండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా- కొలంబియా
కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా- కొలంబియా అడుగుపెట్టాయి. తొలి సెమీఫైనల్లో
కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి అర్జెంటీనా ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో కెనడాపై 1–0 గోల్ తేడాతో విజయం సాధించి కొలంబియా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
జూలై 15న జరగనున్న టైటిల్‌పోరులో అర్జెంటీనా- కొలంబియా తాడోపేడో తెల్చుకోనున్నాయి. కాగా కొలంబియా ఈ టోర్నీలో ఫైనల్ చేరడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అదే విధంగా అర్జెంటీనా డిఫెండింగ్ హోదాలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్, అల్‌కరాజ్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో కార్లోస్ అల్‌కరాజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో తేడాతో ఓడించిన అల్‌కరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. అదే విధంగా రెండో సెమీఫైనల్లో 6–4, 7–6 (7/2), 6–4తో 25వ సీడ్ లరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించి రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ కూడా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.
సరికొత్త ఛాంపియన్‌గా క్రెజికోవా..
ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరుతో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది.
డబ్ల్యూసీఎల్ విజేతగా ఇండియా..
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.
ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత విజయంలో రాయుడు( 50), యూసఫ్ పఠాన్(30) కీలక పాత్ర పోషించారు.
జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్..
ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. వెస్టిండీస్ తొలి టెస్టు అనంతరం తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment