WC 2023- Ind Vs Eng: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తూ జట్టును అగ్రపథంలో నిలపడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించే దశలో ఉన్న ‘డిఫెండింగ్’ చాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. లక్నోలో అక్టోబరు 29న జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా!
పాండ్యా దూరం
ఇదిలా ఉంటే.. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోలేదు. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్ సరణ్‌దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
హార్దిక్ పాండ్యా జట్టుతో ఉన్నా లేకున్నా మరో బౌలింగ్ ఆప్షన్ రెడీగా పెట్టుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఈ మేరకు.. ‘‘జట్టులో కచ్చితంగా ఆరు బౌలింగ్ ఆప్షన్లు ఉండాలి. హార్దిక్ అందుబాటులో ఉన్నా లేకున్నా ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్త వహించాలి.
సెమీస్ రేసులో దూసుకుపోతున్న ప్రతి జట్టు ఇప్పటికే తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కీలక మ్యాచ్‌లకు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మనకు ఆరో బౌలింగ్ ఆప్షన్ చాలా ముఖ్యం.
ఒకవేళ బుమ్రా విఫలమైతే
ఎందుకంటే.. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒకవేళ బాగా ఆడకపోతే.. ఏదేని కారణాలతో అందుబాటులో లేకుంటే పరిస్థితి ఏంటి? కుల్దీప్ యాదవ్ ఒక మ్యాచ్‌లో పరుగులు ఇచ్చినా తిరిగి పుంజుకోవడం సానుకూలాంశం.
ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏ జట్టు కూడా మనపై 350 స్కోరు చేయలేదు. అయితే, మున్మందు ఇలాంటివి జరగొచ్చు. సిక్త్ బౌలర్ అందుబాటులో లేకుంటే రెండు మూడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసేందుకు కోహ్లి లాంటి బ్యాటర్లను పిలవాల్సి ఉంటుంది.
కీలక దశకు చేరుకుంటున్న వేళ మేనేజ్‌మెంట్ అన్ని కోణాల్లో ఆలోచించి ఆచితూచి ముందుకు సాగాలి’’ అని సరణ్‌దీప్ సింగ్ పీటీఐతో మాట్లాడుతూ బీసీసీఐకి సూచనలు చేశాడు. కాగా లక్నో పిచ్‌పై పేసర్లు ఎక్కువగా ప్రభావం చూపుతున్న వేళ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నగా మారింది.
అక్కడ పేసర్లదే పైచేయి
ఇప్పటి వరకు అక్కడ పేసర్లు 26 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు 18 వికెట్లు పడగొట్టారు. మరోవైపు.. ఇంగ్లండ్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేరు కాబట్టి అశూను బరిలోకి దింపితే బాగుంటుందని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తదితరులు సూచిస్తున్నారు.
కాగా ఈ టోర్నీలో చివరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు.. పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలతో బరిలోకి దిగింది.
హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో స్థానంలో వచ్చాడు. మరోవైపు.. నాకౌట్ దశ నాటికి పాండ్యా అందుబాటులోకి వస్తాడనే నమ్మకంతో అతడి స్థానంలో మేనేజ్‌మెంట్ ఎవరినీ తీసుకోలేదు.
చదవండి: మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment