ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా? | What-Is-Worth-FIFA WC-2026 Trophy-Teams Gets-Replica-Not Original | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా?

Jun 5 2026 2:51 PM | Updated on Jun 5 2026 4:14 PM

What-Is-Worth-FIFA WC-2026 Trophy-Teams Gets-Replica-Not Original

ప్ర‌పంచ‌మంతా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్-2026 మ‌రో వారం రోజుల్లో మొద‌లుకానుంది. ఇప్ప‌టికే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడేందుకు అన్ని జ‌ట్లు సిద్ధ‌మయ్యాయి. భార‌త్‌లో క్రికెట్‌కు ఎంత ఆద‌ర‌ణ ఉంటుందో.. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోప్‌, అమెరికా, లాటిన్ దేశాల్లో ఫుట్‌బాల్‌ను విప‌రీతంగా ఆద‌రిస్తుంటారు.

అందుకే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎన‌లేని క్రేజ్ ఉంటుంది. 2022 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన అర్జెంటీనా డిపెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగ‌నుండ‌గా.. గ‌తంలో ఫిఫా విజేత‌లుగా నిలిచిన ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బ్రెజిల్‌, ఇంగ్లండ్‌, స్పెయిన్‌లు మ‌రోసారి ఫిఫా క‌ప్ సొంతం చేసుకోవాల‌ని భావిస్తుండ‌గా, ప్ర‌తీసారి ఫెవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మవుతూ వ‌స్తోన్న పోర్చుగ‌ల్ ఈసారి కూడా టాప్ కంటెండ‌ర్‌గా పోటీలో ఉంది. 

జూన్‌ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్‌లో 48 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 108 మ్యాచ్‌లు జరగనున్న టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. విజేత‌గా నిలిచే జ‌ట్టుకు అందించే ట్రోఫీ విలువ‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేము. అయితే ఇందులో ఉపయోగించే మెట‌ల్స్  ఆధారంగా లెక్కిస్తే ప్రస్తుతం దీని విలువ సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 2,380 కోట్ల పైమాటే.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, ట్రోఫీ తయారీలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్యం కారణంగా దీని విలువ మరింత పెరిగింది. అయితే వాస్తవానికి ఈ ట్రోఫీ విలువ దాని తయారీ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవేళ ఈ ట్రోఫీని నేడు వేలానికి ఉంచితే దీని ధర 20 మిలియన్ డాలర్లకు పైగా పలికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

భారత కరెన్సీలో ఇది రూ.170 కోట్లతో స‌మానం. అయితే గెలిచిన జ‌ట్టుకు అందించే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ దేనితో త‌యారు చేస్తారు, ఎన్ని క్యారెట్ల బంగారాన్ని వాడుతారు? జ‌ట్టుకు అందించే ట్రోఫీ నిజ‌మైనదా లేదా రెప్లికా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

18 క్యారెట్ల బంగారం..
ఫిఫా ట్రోపీ 37 సెంటీమీట‌ర్ల పొడ‌వు ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో త‌యారు చేసే ట్రోపీ ఆరు కిలోల బ‌రువును క‌లిగి ఉంటుంది. ట్రోఫీ డిజైన్ లో ఇద్దరు వ్యక్తులు భూమిని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఫుట్‌బాల్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే క్రీడ అనే సందేశాన్ని ఈ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. అయితే చాలామంది అనుకునేలా ఈ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారై ఉండదు. ట్రోఫీ లోపలి భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా బంగారంతో తయారు చేస్తే అది చాలా బరువుగా మారి ఆటగాళ్లు ఎత్తడం కష్టమవుతుంది. ట్రోఫీ అడుగు భాగంలో రెండు పొరల మలకైట్ అనే ఆకుపచ్చ రంగు ఖనిజాన్ని ఉపయోగించారు.

బ్రెజిల్ ఖాతాలో పాత‌ట్రోఫీ..
ఈ ట్రోఫీని ఇటలీకి చెందిన శిల్పి సిల్వియో గజ్జనిగా రూపొందించారు. 1970లో ఫిఫా నిర్వహించిన అంతర్జాతీయ డిజైన్ పోటీలో ఆయన రూపకల్పన ఎంపికైంది. అంతకుముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంతో శాశ్వతంగా ఆ దేశానికి అప్పగించారు. దీంతో కొత్త ట్రోఫీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా 1974లో పశ్చిమ జర్మనీ గెలుచుకుంది.

విజేతలకు ఇచ్చేది నకిలీదే
ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌రమైన విష‌యం ఏంటంటే.. ఫైన‌ల్‌ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. ఫైనల్ ముగిసిన వెంటనే అసలు ట్రోఫీని ఫిఫా స్విట్జ‌ర్లాండ్‌లోని త‌మ ప్ర‌ధాన కార్యాల‌యం జ్యూరిచ్‌కు తిరిగి తీసుకెళ్తుంది. దాని బదులుగా విజేత దేశానికి బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసిన ప్రత్యేక రిప్లికా ట్రోఫీని అందజేస్తారు. 

దీంతో అసలు ట్రోఫీ ఎప్పటికీ ఫిఫా ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన గుర్తింపుగా నిలిచిన ఈ ట్రోఫీపై ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచ దేశాలు కన్నేస్తుంటాయి.

చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

Advertisement
 
Advertisement
Advertisement