![When You Get 3 Low Scores: Gavaskar Blunt Verdict On Virat Kohli T20 WC Form](/styles/webp/s3/article_images/2024/06/13/kohli2.jpg.webp?itok=0HuTSw2Q)
విరాట్ కోహ్లి
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేశాడు.
న్యూయార్క్ వేదికగా తొలుత ఐర్లాండ్‌పై ఒకటి, పాకిస్తాన్‌పై నాలుగు పరుగులు చేసిన కోహ్లి.. తాజాగా ఆతిథ్య యూఎస్‌ఏ జట్టుతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మూడు మ్యాచ్‌లలో టీమిండియా విజయాలు సాధించినా.. కోహ్లి ఫామ్‌లేమి మాత్రం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
కోహ్లి ఆట తీరుపై విమర్శలు
అదే విధంగా.. విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ వంటి యువ బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా కోహ్లిని పంపడం సత్ఫలితాలు ఇవ్వడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుభవజ్ఞుడైన కోహ్లి సరైన సమయంలో రాణించి జట్టుకు ప్రయోజనం చేకూరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాకౌట్ మ్యాచ్‌లలో అతడి పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నాడు.
బ్యాటింగ్ బాగా లేదని అనుకోవద్దు
‘‘మ్యాచ్‌లు గెలవడం అనేది ఏ ఆటగాడిగైనా అతిపెద్ద ఊరట. గత కొన్నేళ్లుగా కోహ్లి జట్టు కోసం ఇదే పని చేస్తున్నాడు. ప్రస్తుతం మనం వరల్డ్‌కప్ ఆరంభ దశలోనే ఉన్నాం.
దీని తర్వాత సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉన్నాయి. అంత వరకు కాస్త ఓపికగా ఉండటం అవసరం. అతడిపై నమ్మకం ఉంచడం మేలు. ఎందుకంటే.. అందరినీ తప్పని నిరూపించగల నైపుణ్యాలు అతడి సొంతం.
వరుసగా మూడు లో స్కోర్లు నమోదు చేసినంత మాత్రాన అతడి బ్యాటింగ్ బాగా లేదని కాదు. ఒక్కోసారి బౌలర్లు అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తారు. ఇలా జరగటం సహజమే.
కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడి పట్ల నమ్మకం ఉంచుదాం. త్వరలోనే కచ్చితంగా అతడు తన బ్యాట్ పవర్ చూపిస్తాడు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
సూపర్-8 దశకు అర్హత
కాగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టుపై గెలిచిన టీమిండియా.. సూపర్-8 దశకు అర్హత సాధించింది. గ్రూప్(ఏ) దశలో తదుపరి కెనడాతో శనివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన.
అనంతరం సూపర్-8 మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు పయనం కానుంది. అమెరికాతో విండీస్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే
Comments
Please login to add a commentAdd a comment