వచ్చీరాగానే ఇరగదీశాడు.. ఎవరీ అంగ్‌క్రిష్‌ రఘువంశీ? | Who Is Angkrish Raghuvanshi KKR Young Sensation Slam Fifty Vs DC | Sakshi
Sakshi News home page

తొలి ఇన్నింగ్స్‌లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్‌క్రిష్‌ రఘువంశీ?

Published Thu, Apr 4 2024 9:22 AM | Last Updated on Thu, Apr 4 2024 11:39 AM

Who Is Angkrish Raghuvanshi KKR Young Sensation Slam Fifty Vs DC - Sakshi

IPL 2024: Who Is Angkrish Raghuvanshi?: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా మరో ప్రతిభావంతుడైన క్రికెటర్‌ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్‌-2024లో  ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అభిషేక్‌ పోరెల్‌ సత్తా చాటగా..  లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున మయాంక్‌ యాదవ్‌ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన స్పీడ్‌ పవర్‌తో ‍ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు ఈ 21 ఏళ్ల రైటార్మ్‌ పేసర్‌.

ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకుని.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ మయాంక్‌. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో మరో యువ సంచలనం తెర మీదకు వచ్చాడు.

విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ
విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ సృష్టించి తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అతడే అంగ్‌క్రిష్‌ రఘువంశీ. జూన్‌ 5, 2005లో.. ఢిల్లీలో జన్మించాడు ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. అండర్‌ 19 వరల్డ్‌కప్‌-2023 గెలిచిన భారత జట్టులో సభ్యుడు.

యశ్‌ ధుల్‌ సారథ్యంలో యంగ్‌ ఇండియాకు ఆడి ఆ ఏడాది ప్రపంచకప్‌ టోర్నీలో 278 పరుగులు సాధించాడు. తద్వారా భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన అంగ్‌క్రిష్‌ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.

వన్‌డౌన్‌లో వచ్చి దుమ్ములేపాడు
ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌-2024 వేలంలో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా అంగ్‌క్రిష్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. 

అయితే, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అతడికి అవకాశం వచ్చింది. ఇక డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియంలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటిం‍గ్‌ చేసే దక్కించుకున్న అంగ్‌క్రిష్‌.. వన్‌డౌన్‌లో వచ్చి ఇరగదీశాడు.

నరైన్‌ ఊచకోత.. అంగ్‌క్రిష్‌ విధ్వంసం
ఓవైపు సునిల్‌ నరైన్‌(39 బంతుల్లో 85) ఢిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే.. అతడికి తోడుగా మరోవైపు అంగ్‌క్రిష్‌ కూడా దుమ్ములేపే ఇన్నింగ్స్‌ ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు. 

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అతి పిన్న వయసులో అర్ధ శతకం సాధించిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్ల 303 రోజుల వయసులో అంగ్‌క్రిష్‌ ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే యాభై కంటే ఎక్కువ రన్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో 23వ స్థానం సంపాదించాడు.

దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ఆడుతూ..
ఢిల్లీకి చెందిన అంగ్‌క్రిష్‌ రఘువంశీ పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. చిన్ననాటి కోచ్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ అభిషేక్‌ నాయర్‌ సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ముంబై జట్టుకు ఆడే స్థాయికి చేరాడు. 2023లో ముంబై తరఫున లిస్ట్‌ ఏ, టీ20లలో అరంగేట్రం చేశాడు.

సీకే నాయుడు ట్రోఫీ(ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌)లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో సత్తా చాటాడు. ఇక కేకేఆర్‌ తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఇదే జోరు కొనసాగిస్తే సహచర ఆటగాడు రింకూ మాదిరి.. త్వరలోనే టీమిండియాలోనూ అడుగుపెట్టే అవకాశం దక్కించుకోగలడు. ఆల్‌ ది బెస్ట్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ!! ​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement