Photo Courtesy: IPL 2026
గెలిచినోడి కంటే ఓడిపోయినవాడి మీదే సానుభూతి ఎక్కువగా ఉంటుంది. జట్టును గెలిపించినోడు హీరో అవుతాడన్నది కాదనలేని మాట. కానీ అదే సమయంలో ఓడిపోయిన జట్టు నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు అభిమానుల మనసులు గెలుచుకుంటాడు. ఇది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుశ్ మాత్రేకు సరిగ్గా నప్పుతుందని చెప్పొచ్చు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ సమయంలో ఆయుశ్ మాత్రే వాడిన బ్యాట్ విషయంలో అంపైర్ అడ్డుపడడం, ఆ తర్వాత అదే బ్యాట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరిని మెప్పించడం విశేషం. గతేడాది అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టిన ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌కు వచ్చేసరికి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. చెన్నైకి ఓటమి ఎదురైనా ఆయుశ్ మాత్రే రూపంలో సక్సెస్ లభించిందని చెప్పొచ్చు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే చెన్నై ఓటమి చవిచూసినప్పటికీ ఆ జట్టు ఆటగాడు ఆయుశ్ మాత్రే మాత్రం సూపర్‌సక్సెస్ అయ్యాడు.
ఆయుశ్ మాత్రే గతేడాది చెన్నై జట్టు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ముందుగా టీమ్‌లో లేకపోయినా...రుతురాజ్ గాయంతో తప్పుకోవడంతో జట్టుకు ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన మాత్రే ముంబైలోనే ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత బెంగళూరుపై కూడా 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 పరుగులు సాధించి సత్తా చాటాడు.
గత సీజన్‌ను ఘనంగా ముగించిన మాత్రే 2026 ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భావించాడు. కానీ ఈ సీజన్ తొలి పోరులో మొదటి బంతికే వెనుదిరిగి నిరాశపర్చిన అతను ఈ మ్యాచ్‌లో తన కసిని ప్రదర్శించాడు. బార్ట్‌లెట్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో అతను తన పరుగుల ఖాతా తెరిచిన అతను యాన్సెన్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. ఆపై స్టొయినిస్ ఓవర్లో సిక్స్‌తో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను తర్వాతి బంతినీ సిక్స్‌గా మలిచాడు. 59, 67 పరుగుల వద్ద చహల్ బౌలింగ్‌లో వైశాక్, శశాంక్ క్యాచ్‌లు వదిలేయడం అతనికి కలిసొచ్చింది.
అంపైర్ పొరపాటు..
సీఎస్‌కే ఇన్నింగ్స్ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గ్జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఔటయ్యాకా మూడో స్థానంలో ఆయుశ్ మాత్రే క్రీజులోకి వచ్చాడు. అయితే మొదట తీసుకొచ్చిన బ్యాట్ కాస్త అనుమానంగా ఉండడంతో అంపైర్ దానిని పరిశీలించాడు. కానీ బ్యాట్ గేజ్ నుంచి పాస్ కాకపోవడంతో వేరే బ్యాట్‌ను తీసుకొని వచ్చాడు.
కానీ ఈసారి కూడా బ్యాట్ గేజ్‌ను దాటకపోవడంతో టెస్టులో మరోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే మాత్రే తొలుత తీసుకొచ్చి బ్యాట్‌ను అంపైర్ మరోసారి చెక్ చేశాడు. అయితే ఇక్కడ అంపైర్ తన పొరపాటు వల్లే బ్యాట్‌కు గేజ్‌ను సరిగ్గా పెట్టడంలో విఫలమైనట్లు గుర్తించాడు. ఆ తర్వాత మాత్రే తన ఫస్ట్ బ్యాట్‌తోనే ఇన్నింగ్స్ కొనసాగించాడు.
ఎవరీ ఆయుశ్ మాత్రే?
జూలై 16, 2007లో మహారాష్ట్రలోని నల్లసొపారా జిల్లాలో ఆయుశ్ మాత్రే జన్మించాడు. ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ఆయుశ్ మాత్రేకు టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆరాధ్య క్రికెటర్. అతని ఆటను చూస్తూ పెరిగిన ఆయుశ్ మాత్రే పదిహేనేళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
తన కలను నెరవేర్చుకునేందుకు ముంబైలోని విరార్ నుంచి చర్చ్‌గేట్ వరకు రోజు 80 కిలోమీట్లరు ప్రయాణం చేసి ప్రాక్టీస్ కొనసాగించాడు. ఆయుష్ 2024-25 లో ఇరాని ట్రోఫీలో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయుష్ 660 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఇటీవల సంచలనం చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రే రికార్డులకెక్కాడు. 2024 అండర్-19 టీ 20 ప్రపంచకప్ గెలిచిన యంగ్ ఇండియా జట్టులో ఆయుశ్ మాత్రే సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2025లో అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఆయుశ్‌మాత్రే ఆసియాకప్‌లో భారత్‌ను రన్నరప్‌గా నిలిపాడు.
ఈ ఏడాది జరిగిన అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ఆయుశ్ మాత్రే టీమిండియా టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 214 పరుగులు సాధించాడు. అంతేకాదు ఆయుశ్ మాత్రే సారథ్యంలోనే యంగ్ ఇండియా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం.


