రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలితే.. కొందరిని అసలు పట్టించుకోకపోవడం విశేషం. మెగా వేలంలో అన్‌సోల్డ్ జాబితా కూడా పెద్దగానే ఉంది. టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా మొదలుకొని స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, తబ్రెయిజ్ షంసీ, కేదార్ జాదవ్, కొలిన్ గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి లాంటి కీలక ఆటగాళ్లవైపు కనీసం తొంగిచూడలేదు.
సారీ సురేశ్ రైనా..
205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు.
►అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరున్న షకీబ్ అల్ హసన్‌వైపు కూడా ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కారణం షకీబ్ ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే. నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరున్నప్పటికి షకీబ్ ఐపీఎల్‌లో పెద్దగా రాణించింది లేదు.
►ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పరిస్థితి మరొకటి. పరిమిత, టెస్టు క్రికెట్‌లో మంచి పేరున్న స్మిత్ టి20 క్రికెట్‌లో అంతగా రాణించలేడనే ముద్ర ఉంది. నిలబడితే మెరుపులు మెరిపించే స్మిత్.. ఆరంభంలో ఎక్కువ సమయం తీసుకుంటాడు. టి20లకు ఇలాంటి ఆట సరిపోదు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల్లో అస్సలు పనికిరాదు. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి స్మిత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు.
►గతేడాది ఐపీఎల్‌లో కేకేఆర్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికి.. బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ ఒక్కటే కాదు.. బ్యాటింగ్‌లోనూ మెరవాలి అన్న సంగతి మోర్గాన్ మరిచిపోయాడు. అందుకే ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అతన్ని మరిచిపోయాయి. ఏదైనా ఒక గొప్ప కెప్టెన్‌గా పేరున్న మోర్గాన్ ఐపీఎల్ కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే.
ఆటగాళ్లకు జాక్‌పాట్.. విండీస్ ప్లేయర్లే ఎక్కువగా
ఈసారి మెగావేలంలో అనూహ్య జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్ల సంఖ్య ఎక్కవే ఉంది. కాగా ఆ జాబితాలో విండీస్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు పంట పండిందనే చెప్పొచ్చు. విండీస్ ఆటగాళ్లు.. నికోలస్ పూరన్(రూ. 10 కోట్లు), ఓడియన్ స్మిత్(రూ. 6 కోట్లు), రొమెరియో షెఫర్డ్(రూ. 7.75 కోట్లు), జాసన్ హోల్డర్(8.75 కోట్లు), హెట్‌మైర్‌లకు (రూ. 8.50 కోట్లు) అనుకున్నదానికంటే ఎక్కువే దక్కింది. ఇక సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కూడా(రూ. 8 కోట్లు) ఊహించని ధరకు అమ్ముడుకావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment