![Will Host Winning Tradition In First Match Continues In FIFA World Cup 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/9/ss.jpg.webp?itok=iXBUxK5B)
తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 2006 నుంచి తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఉండేలా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య షెడ్యూల్ రూపొందిస్తోంది. గత నాలుగు ప్రపంచకప్‌లలోనే కాకుండా అంతకుముందు జరిగిన ప్రపంచ కప్‌లలోనూ ఆతిథ్య దేశం తాము ఆడిన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ప్రత్యర్థి ఎంతటి జట్టయినా ఆతిథ్య జట్టు గెలవడం లేదంటే ‘డ్రా’ చేయడం జరిగింది.
గతంలో వరుసగా 11 సార్లు ఆసియా క్వాలిఫయింగ్ దశలోనే నిష్క్రమించిన ఖతర్ జట్టు ఆతిథ్య దేశం హోదాలో తొలిసారి ప్రపంచకప్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతోంది. 12 ఏళ్ల క్రితం ఆతిథ్య హక్కులు పొందిన వెంటనే ఖతర్ జట్టు సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి ప్రధాన టోర్నీలో నేరుగా ఆడే అవకాశం రావడంతో మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉంది.
ఈనెల 20న జరిగే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ ఆడుతుంది. ఇప్పటివరకు ఆతిథ్య జట్లకు తాము ఆడిన తొలి మ్యాచ్‌లలో అనుకూల ఫలితాలే వచ్చాయి. ఈ సంప్రదాయాన్ని ఖతర్ కూడా కొనసాగిస్తూ విజయంతో బోణీ కొడుతుందో, లేదంటే ‘డ్రా’తో పాయింట్ల ఖాతా తెరుస్తుందో వేచి చూడాలి. 2018 ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం రష్యా తొలి మ్యాచ్‌లో 5–0తో సౌదీ అరేబియాను ఓడించగా... 2014 మెగా ఈవెంట్‌లో బ్రెజిల్ 3–1తో క్రొయేషియాపై గెలిచింది.
2010 టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌ను మెక్సికోతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2006లో జర్మనీ 4–2తో కోస్టారికాను ఓడించి శుభారంభం చేసింది. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా... తమ తొలి మ్యాచ్‌ల్లో కొరియా 2–0తో పోలాండ్‌పై గెలుపొందగా... బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ను జపాన్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 1998లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో 3–0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
1994లో ఆతిథ్య అమెరికా దేశం తొలి మ్యాచ్‌ను స్విట్జర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 1990లో ఇటలీ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆస్ట్రియాను ఓడించింది. 1986లో మెక్సికో జట్టు 2–1తో బెల్జియంపై గెలిచింది. 1982లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను హోండూరస్‌తో 1–1తో ‘డ్రా’గా ముగించింది. 1978లో ఆతిథ్య అర్జెంటీనా జట్టు 2–1తో హంగేరిపై గెలిచింది.
1974లో పశ్చిమ జర్మనీ 1–0తో చిలీపై నెగ్గగా, 1970లో మెక్సికో 0–0తో సోవియట్ యూనియన్‌తో... 1966లో ఇంగ్లండ్ 0–0తో ఉరుగ్వేతో ‘డ్రా’ చేసుకుంది. 1962లో చిలీ 3–1తో స్విట్జర్లాండ్‌పై... 1958లో స్వీడన్ 3–0తో మెక్సికోపై.. 1954లో స్విట్జర్లాండ్ 2–1తో ఇటలీపై... 1950లో బ్రెజిల్ 4–0తో మెక్సికోపై.. 1938లో ఫ్రాన్స్ 3–1తో బెల్జియంపై... 1934లో ఇటలీ 7–1తో అమెరికాపై... 1930లో ఉరుగ్వే 3–1తో పెరూపై విజయం సాధించాయి. –సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment