ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ తన ప్రయాణం కొనసాగిస్తోంది. విజయంతో సీజన్‌ను ఆరంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్‌కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి.
అందులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఎందుకు ఆడడం లేదన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ వారంలోపూ విల్ జాక్స్ ముంబై ఇండియన్స్‌తో చేరతాడని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విల్ జాక్స్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విల్ జాక్స్ తన భార్య అనా బ్రుమ్‌వెల్‌తో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి.
అంతేకాదు జాక్స్ భార్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎంజాయింగ్ హాలిడే ట్రిప్’ పేరిట స్టోరీని షేర్ చేసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఈ లెక్కన విల్ జాక్స్ ఇప్పట్లో ఐపీఎల్‌లో అడుగుపెట్టే అవకాశాలు లేనట్లేనని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అమెరికన్ సింగర్ అలెక్స్ వారెన్ మ్యూజిక్ కన్సర్ట్‌కు జాక్స్ తన భార్యతో కలిసి హాజరయ్యేందుకే పారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక ఫ్రాన్స్‌లో అడుగుపెట్టడానికి ముందు మొరాకోలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశారు. కాగా విల్ జాక్స్ ఈ ఏడాది యాషెస్ సిరీస్ సమయంలోనే తన స్కూల్ ఫ్రెండ్ అయిన అనా బ్రూమ్‌వెల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అయితే విల్‌కు 14 ఏళ్ల వయసులోనే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, అసలే రెండు వరుస ఓటములతో ఢీలా పడిన ముంబై ఇండియన్స్‌కు విల్ జాక్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిస్తే ఏమవుతుందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే విల్ జాక్స్ విషయమై ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం స్పందించాడు.
‘విల్ జాక్స్ త్వరలోనే జట్టుతో చేరుతాడని ఆశిస్తున్నా’ అంటూ తెలిపాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ తరఫున 233 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. విల్ జాక్స్ లేకపోవడం వల్ల ముంబై జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. విల్ జాక్స్ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచ్‌లో ఆఫ్గన్ ఆటగాడు అల్లాఘన్‌జఫర్‌ను ఆడించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
రెండో మ్యాచ్‌లో అతడిని తొలగించి మిచెల్ శాంట్నర్‌కు అవకాశమిచ్చారు. ఇక మూడో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. విల్ జాక్స్ జట్టులో చేరితే మాత్రం ఆల్‌రౌండర్‌గా తన పాత్రకు న్యాయం చేయగలడని ముంబై ఇండియన్స్ ఆశిస్తోంది. ముంబై తన తదుపరి మ్యాచ్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.
No way my bruh Will Jacks is roaming in the streets of Paris 😭 https://t.co/OpZ8tjzYkw pic.twitter.com/atrDFVqePs
— Mumbai Indians FC (@MIPaltanFamily) April 9, 2026
చదవండి: ‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టును చూడాలి’


