అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు పతకం ఖరారైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్‌లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్‌ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు.
నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్‌లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది.
ధీరజ్ అద్భుతం...
పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్‌లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్‌లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్‌లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్‌పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్‌దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు.
ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు.
ఆధిక్యంలో అర్జున్
సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్‌ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.
వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్‌తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్‌లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment