ముగిసిన ఆట.. చేతిలో ఏడు వికెట్లు; విజయానికి 280 పరుగుల దూరంలో
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 44, రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు చేతిలో ఏడు వికెట్లు ఉండగా.. చేయాల్సిన పరుగులు 280. చివరి రోజు మొత్తం నిలబడితే మాత్రం టీమిండియాకు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే మాత్రం ఓటమి ముప్పు పొంచి ఉంది.
ఏది ఏమైనా క్రీజులో కుదురుకున్న కోహ్లి, రహానేలు ఆదివారం తొలి సెషన్‌లో ఆడబోయే ఆటతో టీమిండియా కథ తేలిపోనుంది. పరిస్థితి ఏ మాత్రం ప్రతికూలంగా మారినా టీమిండియా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం మేలు. 444 పరుగుల టార్గెట్‌ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక వికెట్లు పోగొట్టుకొని డ్రా లేదా ఓటమిని మూగట్టకుంటుందా అనేది చూడాలి.
నిలకడగా ఆడుతున్న కోహ్లి, రహానే.. టీమిండియా 136/3
444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 33 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కోహ్లి 30, రహానే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పూజారా(27) ఔట్.. మూడో వికెట్ డౌన్
రోహిత్ ఇలా ఔటయ్యాడో లేదు నేను కూడా అంటూ పుజారా పెవిలియన్ చేరాడు. ఒకే ఓవర్లో కమిన్స్ రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 27 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయి కష్టాల్లో పడింది. ఇక బారం అంతా కోహ్లి, రహానేలపైనే ఉంది.
రోహిత్ శర్మ(43)ఔట్.. రెండో వికెట్ డౌన్
రోహిత్ శర్మ(43) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 352 పరుగుల దూరంలో ఉంది.
నిలకడగా ఆడుతున్న రోహిత్.. టీమిండియా 66/1
టీ విరామం అనంతరం చివరి సెషన్ ఆడుతున్న టీమిండియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 33 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. అతనికి పుజారా నుంచి చక్కని సహకారం అందుకుంది. టీమిండియా విజయానికి 378 పరుగులు అవసరం ఉంది.
టీ విరామం.. తొలి వికెట్ పడింది.. గిల్(18) ఔట్
444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే స్లిప్‌లో ఉన్న గ్రీన్ బంతి కింద పెట్టినట్లు అల్ట్రాఎడ్జ్‌లో కనిపించింది. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్ ఔటిచ్చాడు. వికెట్ నష్టానికి 41 పరుగులతో టీమిండియా టీ విరామానికి వెళ్లింది.
టార్గెట్ 444.. టీమిండియా 4 ఓవర్లలో 23/0
444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 14, శుబ్‌మన్ గిల్ 9 పరుగులతో ఆడుతున్నారు.
ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్.. టీమిండియా టార్గెట్ 444
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ కేరీ 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లబుషేన్ 41, మిచెల్ స్టార్క్ 41 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 433 పరుగుల ఆధిక్యంలో
మిచెల్ స్టార్క్(41) రూపంలో ఆస్ట్రేలియా 260 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 433 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. టీమిండియాకు 450 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించే అవకాశం ఉంది.
400 దాటిన ఆసీస్ ఆధిక్యం
లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో వేగం పెంచింది. ప్రస్తుతం 400 పరుగుల ఆధిక్యం దాటిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతుంది. అలెక్స్ కేరీ 57 పరుగులు, మిచెల్ స్టార్క్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా విజయం కన్నా డ్రా దిశగా ఆడడం మేలు.
లంచ్ విరామం.. 374 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 70 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 41, మిచెల్ స్టార్క్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. 400 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచాలని ఆసీస్ భావిస్తుంది.
తిప్పేసిన జడ్డూ.. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
25 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్‌ను జడేజా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లోటాస్‌గా వెళ్లిన బంతి గ్రీన్ బ్యాట్ హ్యాండిల్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఆసీస్ 167 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. జడ్డూ స్పిన్ మాయాజాలానికి గ్రీన్ నోరెళ్లబెట్టాడు. ఇక ఆసీస్ 340 పరుగుల ఆధిక్యంలో ఉంది.
321 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
నాలుగో రోజు ఆటలో ఐదో వికెట్ త్వరగానే తీసినప్పటికి తర్వాతి వికెట్లు తీయడానికి టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
లబుషేన్‌ను ఔట్ చేసిన ఉమేశ్.. ఐదో వికెట్ డౌన్
నాలుగోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ 41 పరుగులు చేసిన లబుషేన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 297 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట మొదలైంది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు. మిగిలిన 6 వికెట్లతో ఆ జట్టు శనివారం ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. పిచ్ నెమ్మదిస్తుండటంతో ప్రస్తుతానికి ఇంకా మ్యాచ్ ఆ్రస్టేలియాతో చేతిలోనే ఉన్నట్లు!
Comments
Please login to add a commentAdd a comment