చిక్కుల్లో జైస్వాల్‌, షఫాలీ.. నిషేధం పడే అవకాశం! | Yashasvi Jaiswal-Shafali Verma-Trouble-Missing Dope Test May-Banned | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో జైస్వాల్‌, షఫాలీ.. నిషేధం పడే అవకాశం!

May 9 2026 4:44 PM | Updated on May 9 2026 5:00 PM

Yashasvi Jaiswal-Shafali Verma-Trouble-Missing Dope Test May-Banned

టీమిండియా క్రికెటర్లు జైస్వాల్, ష‌ఫాలీ వ‌ర్మ‌ చిక్కుల్లో పడ్డారు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) భార‌త క్రికెట‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్, ష‌ఫాలీ వ‌ర్మ‌ల‌కు నోటీసులు జారీ చేసింది. వీరిద్ద‌రు డోపింగ్ టెస్టుకు అందుబాటులోకి రాక‌పోవ‌డంపై నాడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలో జైస్వాల్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌ల‌ పేర్లపై ‘మిస్ టెస్ట్’ న‌మోదు చేసింది. 

దీనిపై ఏడు రోజ‌ల్లోగా స‌మాధానమివ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే ఐసీసీతో పాటు బీసీసీఐకి కూడా నాడా నివేదించింది. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే ఈ ఇద్దరు క్రికెటర్లపై నిషేధం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

విష‌యంలోకి వెళితే.. నాడా నిబంధనల ప్రకారం.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్స (ఆర్టీపీ)లో ఉన్న ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటున్నామో ముందే సమాచారం అందించాలి.  దీనినే 'వేర్ అబౌట్ క్లాజ్' అంటారు. 

గతేడాది డిసెంబర్ 17న డోప్ కంట్రోల్ ఆఫీసర్ పరీక్ష కోసం వెళ్లగా, జైస్వాల్ తాను చెప్పిన చోట అందుబాటులో లేరు. అలాగే నవంబర్ 7న షెఫాలీ వర్మ కూడా తాను ఇచ్చిన అడ్ర‌స్‌లో లేకపోవడంతో ఆమె టెస్ట్ కూడా మిస్ అయ్యింది. 

కేవలం టెస్టుకు గైర్హాజరు కావడమే కాకుండా, దీనిపై వివరణ ఇవ్వాలని నాడా పంపిన నోటీసులను కూడా వీరిద్దరూ నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో సమాధానం చెప్పాలని కోరినప్పటికీ, వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా తాజాగా వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది.

నిషేధం పడనుందా?
ప్రస్తుతానికి వీరిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే నాడా/వాడా నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదిలో (12 నెలలు) మూడుసార్లు టెస్టుకు అందుబాటులో లేకపోతేనే దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరు కేవలం ఒకసారి మాత్రమే టెస్ట్ మిస్ అయ్యారు. 

అయితే మరో రెండుసార్లు ఇలాగే జరిగితే మాత్రం సదరు ఆటగాళ్లపై 2 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చదవండి: ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా!

Advertisement
 
Advertisement
Advertisement