Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది.
పాక్ పేసర్ల ధాటికి
పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
ఈ నేపథ్యంలో నేపాల్‌పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్.
షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంటే
ఇందులో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు.
షమీ- శార్దూల్ (PC: BCCI)
ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్‌లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు.
పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే
‘‘బౌలింగ్ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలి. గత మ్యాచ్ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి.
అలా కాకుండా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్‌ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్‌బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్‌లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు.
రిజర్వ్ డే
కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డేను కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్.
చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్‌లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు?
Comments
Please login to add a commentAdd a comment