IND VS PAK: షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంది ఇందుకేనా..? | Asia Cup 2023 IND VS PAK: Fans Criticise Rohit Sharma Calculation Over Shami Exclusion And Shardul Intake | Sakshi
Sakshi News home page

IND VS PAK: షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంది ఇందుకేనా..?

Published Sat, Sep 2 2023 7:45 PM | Last Updated on Sat, Sep 2 2023 8:07 PM

Asia Cup 2023 IND VS PAK: Fans Criticise Rohit Sharma Calculation Over Shami Exclusion And Shardul Intake - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఇషాన్‌ కిషన్‌ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్‌ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్‌) ఆదుకున్నారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇషాన్‌, హార్ధిక్‌ ఔటవ్వగానే రవీంద్ర జడేజా (14), శార్దూల్‌ ఠాకూర్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లారు. కేవలం 3 పరుగుల వ్యవధిలో హార్దిక్‌, జడేజా, శార్దూల్‌ ఔటయ్యారు.దీంతో 48.5 ఓవర్లలో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. 266 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. ఆఖర్లో బుమ్రా (16) అడపాదడపా బ్యాట్‌ను ఝులిపించడంతో భారత్‌ 250 పరుగుల మార్కును దాటింది.

ఇదిలా ఉంటే, షమీని కాదని శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తలాతోకా లేని లాజిక్‌ చెప్పి షమీని పక్కకు పెట్టాడని దుయ్యబడుతున్నారు. బ్యాటింగ్‌ డెప్త్‌ కోసమని కీలక బౌలర్‌ను పక్కకు పెట్టడమేంటని అక్షింతలు వేస్తున్నారు. శార్దూల్‌ కేవలం 3 పరుగులు చేసి ఔటైన విధానాన్ని చూసి, ఇందుకేనా షమీని కాదని ఇతన్ని తీసుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ మాత్రం బ్యాటింగ్‌ షమీ చేయలేడా అని అంటున్నారు.

శార్దూల్‌ కోసమని షమీని పక్కకు పెట్టి టీమిండియా తగు మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ మోస్తరు స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవాలంటే షమీ ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పిచ్‌ కూడా పేసర్లకు సహకరిస్తుండటంతో ఫ్యాన్స్‌ ఈ విషయంలో రోహిత్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాగా, షమీని ఇలా పొంతనలేని కారణాల చెప్పి పక్కకు పెట్టిడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో బలమైన కారణాలు లేకుండా షమీని బెంచ్‌కు పరిమితం చేశారు. ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే రిపీటవుతుందేమోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement