ఆసియా కప్-2023లో భారత్-పాక్‌లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. తొలుత ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తలపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆతర్వాత ఇరు జట్లు మరోసారి సూపర్-4 స్టేజీలో ఎదురెదురుపడ్డాయి. అప్పుడు టీమిండియా.. పాక్‌ను 228 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ప్రస్తుత సమీకరణల ప్రకారం భారత్, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న కొలొంబోలో జరిగే ఫైనల్లో మరోమారు దాయాదుల పోరు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే, ఇది జరగాలంటే రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే గ్రూప్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పక గెలవాల్సి ఉంటుంది. గెలుపు తప్ప వేరే ఏ ఇతర ఫలితం వచ్చినా, పాక్ ఫైనల్‌కు చేరదు. ఎందుకంటే ప్రస్తుతం పాక్ (-1.892) కంటే శ్రీలంకకు (-0.200) మెరుగైన రన్‌రేట్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది.
మరోవైపు భారత్ ఇంకో మ్యాచ్ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉండగానే ఫైనల్‌కు చేరుకుంది. పాక్, శ్రీలంకలపై వరుస విజయాలతో భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కారణంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాబట్టి కొలొంబో వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పక గెలిస్తేనే, ఫైనల్లో దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రేపటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాకుండా ఉండాలని, అలాగే లంకపై పాక్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment