2019-2022 మధ్యకాలంలో సెంచరీలు లేక గడ్డుకాలం ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 2022 సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శతకంతో (ఆసియా కప్ టీ20 టోర్నీ) తిరిగి శతకబాట పట్టిన విషయం తెలిసిందే. కెరీర్‌లో 71 శతకం కోసం మూడేళ్ల పాటు నిరీక్షించిన కోహ్లి.. ఆతర్వాత సెంచరీ సెంచరీల దిశగా వడివడిగా అడుగులు (ప్రస్తుతం 77 సెంచరీలు) వేస్తున్నాడు.
మూడేళ్లకాలంలో ఒక్క సెంచరీ కూడా చేయలేని కోహ్లి, ఆతర్వాత సరిగ్గా ఏడాది కాలంలోనే ఏడు సెంచరీలు బాది మునుపటి కంటే చాలా ప్రమాకరంగా కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని కోహ్లికి దగ్గరి వారు పలు మార్లు ముందే ప్రస్తావించారు. ప్రపంచ బౌలర్లు కోహ్లి 2.0ను తట్టుకోలేరు.. మాడి మసైపోతారని వారు ముందే హెచ్చరించారు. వారి అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం జరుగుతుంది.
కోహ్లి తన 71వ సెంచరీ చేశాక భీకర ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతన్ని ఆపడం బహుశా ప్రపంచ క్రికెట్‌లో ఏ బౌలర్‌కు సాధ్యపడకపోవచ్చు. ఆఫ్ఘన్‌పై సెంచరీ తర్వాత అదే ఏడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో సెంచరీ చేసిన కింగ్ 2022ను 2 సెంచరీలతో ముగించాడు.
2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న కింగ్ ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 21 ఇన్నింగ్స్‌ల్లో 58.42 సగటున 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 1110 పరుగులు చేశాడు. కోహ్లి ప్రస్తుత భీకర ఫామ్‌ను చూసి ప్రపంచ బౌలర్లు దడుసుకుంటున్నాడు.
ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌కు ముందు కోహ్లి ఇలాంటి అరివీర భయంకర ఫామ్‌లో ఉండటాన్ని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టాప్ జట్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందులోనూ వరల్డ్‌కప్ భారత్‌లోనే జరుగుతుండటంతో వారి భయం పతాకస్థాయికి చేరింది. కోహ్లికి బ్రేకులు వేసేందుకు వారు ఇప్పటినుంచే ఎత్తుగడలు సిద్దం చేసుకుంటున్నారు.
కోహ్లి ఇలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడు తలవంచుకని పోవడం తప్పించి చేసేదేమీ ఉండదని వారికి తెలిసినప్పటికీ, వారి వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోహ్లి ఇదే ఫామ్‌లో కొనసాగితే, భారత్ ముచ్చటగా మూడోసారి జగజ్జేతగా నిలవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లి వరల్డ్‌కప్‌లో ఐదుకు పైగా సెంచరీలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారంటున్నారు.
కోహ్లి 2.0 అంటే ఏదో అనుకున్నాం.. మరీ ఇంతలా ప్రమాదకారిగా మారతాడని అనుకోలేదని ప్రపంచ జట్లన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. మరి ఈ ఏడాది కోహ్లి ఇంకెన్ని సెంచరీలు చేస్తాడో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లి (122 నాటౌట్) శతకాలతో విరుచుకుపడటంతో టీమిండియా పాక్‌పై భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ (56), శుభ్‌మన్ గిల్ (58) కూడా హాఫ్ సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment