Asia Cup, 2023 Pakistan vs India- Toss- Rohit Sharma Comments: ‘‘మేము ముందు బ్యాటింగే చేస్తాం. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు కదా! మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం.సవాళ్లు, కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. వెస్టిండీస్ పర్యటన తర్వాత మాకు కావాల్సినంత సమయం దొరికింది.
బెంగళూరులో మా ఆటగాళ్లంతా కఠినంగా శ్రమించారు. ఈ టోర్నీలో మా ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ప్రత్యర్థి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఏదేమైనా.. జట్టుగా మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి ఉంది. అయ్యర్, బుమ్రా తిరిగి వచ్చారు. ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో ప్రయాణం ఆరంభం
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. ఆసియా కప్-2023లో భారత్.. దాయాది పాక్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇందుకు వేదిక అయింది.
ఆశ్చర్యపరిచిన రోహిత్ నిర్ణయం
ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయాల నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంటాడని అంతా భావించారు.
కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోహిత్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేశామని హిట్‌మ్యాన్ ధీమాగా ఉన్నప్పటికీ.. వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు.
షమీకి నో ఛాన్స్
కాగా క్యాండీలోని హై క్వాలిటీ పిచ్‌పై బౌలర్లు లేదంటే బ్యాటర్లు.. ఎవరు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చకుంటే వారికే మేలు చేకూర్చే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ హైవోల్టేజీ వన్డేలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశమిచ్చిన మేనేజ్‌మెంట్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని పక్కనపెట్టింది.
ఆసియా కప్-2023 పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: మా దగ్గర షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ లేరు.. అదే ప్లస్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment