టెస్టు క్రికెట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటితరం క్రికెటర్లు టి20 క్రికెట్ ఆడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. దీనివల్ల టెస్టు క్రికెట్ చనిపోయే దశలో ఉందంటూ పేర్కొన్నాడు. హోమ్ ఆఫ్ హీరోస్ షోలో యువరాజ్ సింగ్ పాల్గొన్నాడు.
''టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ప్రజలు టి20 క్రికెట్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు, టి20 ఫార్మాట్‌లో ఆడటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో ఆటగాళ్లు వన్డేల కంటే టి20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఒక్కరోజు టి20 ఆడితే రూ.50 లక్షలు వస్తున్నప్పుడు.. ఐదు రోజుల క్రికెట్ ఆడి రూ. 5 లక్షల ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్క సీజన్ కోసం రూ.7 నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నారు. దీంతో వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతోంది. టి20 ఫార్మాట్‌కు అలవాటు పడ్డాకా 50 ఓవర్ల మ్యాచ్ కూడా టెస్ట్ మ్యాచ్‌లాగే అనిపిస్తోంది. అందుకే టీ20లదే క్రికెట్ భవిష్యత్తు అని చెప్పొచ్చు.
ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో టీమిండియా విఫలం కావడానికి మిడిలార్డర్ ప్రధాన కారణం. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ వరల్డ్‌కప్‌కు జట్టును సరిగ్గా ప్లాన్ చేయలేదు. కేవలం 5,6 వన్డేలు ఆడిన విజయ్ శంకర్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ గాయపడడంతో అతని స్థానాన్ని రిషబ్ పంత్‌తో భర్తీ చేశారు. అప్పటికే మంచి అనుభవం ఉన్న రాయుడుకు మాత్రం అవకాశం కల్పించలేదు. 2003ప్రపంచకప్ జట్టులో నేను ఆడినప్పుడు.. నాతో పాటు మహమ్మద్ కైఫ్, దినేష్ మోంగియా అప్పటికే 50 వన్డేలు ఆడి కొంత అనుభవాన్ని గడించాము. టీమిండియా 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు, అప్పటి జట్టులో మేమందరం ఒక ఫిక్స్‌డ్ బ్యాటింగ్ పొజిషన్ కలిగి ఉన్నాం. అందుకే 28 సంవత్సరాల తర్వాత కప్‌ను గెలిచాం.'' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై..
Comments
Please login to add a commentAdd a comment