ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో.. మరో తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.
ఇటీవలే పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్‌లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్‌ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్‌కప్‌తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది.
తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్‌లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.
ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు.
చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా
Comments
Please login to add a commentAdd a comment